Family Suspicious Death: విశాఖ కంచరపాలెం పరిధిలో తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతి తీవ్ర కలకలం రేపింది. ప్రాథమికంగా అనుమానాస్పద మరణాలుగా భావిస్తున్నా... ఆర్థిక సమస్యలు, ఇంటిపెద్దపై నమోదైన చోరీ కేసు కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు సందేహం వ్యక్తంచేస్తున్నారు.
విశాఖ కంచరపాలెంలోని పాత రామారావు ఆసుపత్రి సమీపంలోని గంగన్ననగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదంగా చనిపోయారు. వీరిని పిల్లా దుర్గాంజనేయ ప్రసాద్ అనే వ్యక్తితోపాటు ఆయన కుమార్తెలు బిందుమాధవి, భార్గవిగా గుర్తించారు. దుర్గాంజనేయ ప్రసాద్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్థితిలో ఉండగా.. బిందుమాధవి, భార్గవి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు.
గురువారం సాయంత్రం ప్రసాద్ తల్లి అనసూయ.. కుమారుడి ఇంటికి వచ్చారు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో సెల్‌ఫోన్‌కి కాల్ చేశారు. ఫోన్ కూడా ఎత్తకపోవడంతో.. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పారు. వారు అనుమానించి డయల్ 100కి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ప్రసాద్‌తోపాటు బిందుమాధవి, భార్గవి చనిపోయి ఉండటాన్ని గుర్తించి.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. డీసీపీ ఆనందరెడ్డి, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి.. ఘటన జరిగిన ఇంటిని పరిశీలించారు.
ఆర్థిక ఇబ్బందులు, ప్రసాద్‌పై గతంలో నమోదైన చోరీ కేసు ఈ చావులకు కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
భార్య నాగమణి 2013లో మృతి చెందినప్పటి నుంచి.. కుమార్తెలు బిందు మాధవి, భార్గవితో కలిసి గంగన్న నగర్‌లోని అద్దె ఇంట్లో ప్రసాద్ నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం వరకు ఆటో నడిపి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ప్రసాద్.. ఇటీవల ఖాళీగా ఉంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి :