విశాఖ జిల్లా అరకులోయ మండలంలో సుమారు 1200 ఎకరాల మేర కూరగాయల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అరకు వాతావరణానికి బజ్జీ మిర్చి అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సుమారు 600 ఎకరాల్లో ఈ మిర్చిని సాగు చేశారు. కష్టపడి సాగుచేసినా.. లాక్డౌన్ పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక పోయింది. గతేడాది బస్తా 1200 రూపాయల పలికినా… ఈ ఏడాది వంద రూపాయలకు కొనేవారే కరువయ్యారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు బజ్జి మిర్చికి చీడపీడలు సోకకుండా చేతికందే తరుణంలో మిర్చి కుళ్ళిపోతుంది. క్రిమిసంహారక మందులు వేయాలంటే మైదాన ప్రాంతానికి వెళ్లాలి. లాక్ డౌన్ కారణంగా రైతులు వెళ్లి కనుక్కొని రాలేని పరిస్థితి. పొలంలోనే పాడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు క్యాబేజీ తదితర పంటలకు కొనే వారు కరువయ్యారు. దిక్కుతోచని స్థితిలో రైతులు పొలాల్లోనే క్యాబేజీని వదిలేసారు. మరికొంత మంది రైతులు పశువులకు ఆహారంగా క్యాబేజీని వేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్‌జెట్