Environment friendly Diwali awareness program In AP: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సంతోషంగా జరుపుకోవటం ఆనవాయితీ. బాణసంచా కాల్చటంలో ఒకరికొకరు పోటీ పడుతూ సందడి చేస్తుంటారు. అయితే బాణసంచా కాల్చటం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే పర్యావరణహిత పండగ చేసుకోవాలంటూ విశాఖలో ఓ విద్యా సంస్థ ప్రచారం చేస్తోంది. విద్యార్థులతో పాటు నగర ప్రజలకు చైతన్యం తీసుకువస్తున్నారు. కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను వివరిస్తున్నారు.
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు: దీపావళి అంటేనే బాణసంచాను కాల్చటం అనేది చాలామంది భావిస్తాం. దీపావళి అంటే దీపాలంకరణ అని చాటి చెబుతున్నారు. ప్రతీ ఏటా దీపావళి పండుగ రోజున కాలుష్య ప్రభావం తప్పటంలేదు. పర్యావరణహిత దీపావళిని జరుపుకొవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో బాణ సంచా తయారీ సంస్థలు కూడా ఈ ఏడాది భారీ పేలుడు, పెద్ద ఎత్తున కాలుష్యం ప్రభావిత బాణసంచా విక్రయాలు కూడా నిలిపివేసినట్లు సమాచారం.. పర్యావరణహిత దీపావళి అంటే ఎలా జరుపుకోవాలో అనే విషయంపై లోటస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
లోటస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సంస్థ అవగాహన కార్యక్రమాలు: బాణసంచా కాల్చటానికి ఎక్కువగా ఇష్టపడే విద్యార్థులను చైతన్యపరుస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీపావళి పండగను పర్యావరణహితంగా జరుపుకోవాలంటే దేశీయ ఆవుపేడతో చేసిన ప్రమిదల్లో కానీ, మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని సూచిస్తున్నారు. ఇక కాలుష్యం తక్కువగా ఉండే కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబులు వంటివి మాత్రమే ఉపయోగించాలని, భారీ పేలుడుతో కూడిన బాణసంచాకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. .
ముగ్గుల పోటీలు: పర్యావరణహిత దీపావళిని జరిపేందుకు విద్యార్థుల్లో చైతన్యం తీసుకువస్తున్నామని తమ ఇనిస్టిట్యూట్లో సైతం ముగ్గుల పోటీలను నిర్వహించామని.. అందులో పాల్గొన్న విద్యార్థులు ముగ్గుతో పాటు సందేశాన్ని కూడా ఇవ్వడం చక్కని విషయమని ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ తరహా అవగాహనతో కొంత మేరైనా కాలుష్య ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: