రెట్టింపు దిగుబడులు సాధించే విధంగా రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చేందుకు "డా. వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమం" రాష్ట్రంలోనే ప్రథమంగా విశాఖ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలో కె.కోటపాడు మండలంలో సుడివలస గ్రామం, వి.మాడుగుల మండలం శంకరం గ్రామం, అనంతగిరి మండలం సీతంపేట గ్రామం, జి.మాడుగుల మండలం కె.కొండపల్లి గ్రామం, నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామం, గొలుగొండ మండలం కసిమి గ్రామంలో డా. వైఎస్ఆర్ తోటబడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు గోపి కుమార్ తెలిపారు. ప్రతి శుక్రవారం గ్రామంలో వ్యవసాయ సహాయకుడు, ఉద్యానవన సహాయకుడు సమగ్ర పంటల యాజమాన్య పద్థతులను రైతులకు తెలియజేస్తారని వెల్లడించారు.
గ్రామంలో ఒక ఉద్యాన ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేసి పంటల యాజమాన్యంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష శిక్షణ అందజేస్తారని తెలిపారు. ఆధునిక ఉద్యాన వ్యవసాయంతో సమగ్ర కీటక నివారణ, పోషక వివరాలను తెలియజేస్తారని పేర్కొన్నారు. నీటి యాజమాన్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి బిందు సేద్యం ప్రాముఖ్యత, ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచుకునే విధానాన్ని తెలుపుతారన్నారు. ప్రభుత్వ ఉద్యాన పథకాలు, రాయితీ వివరాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతాయని తెలిపారు. దిగుబడి, మార్కెటింగ్ సమస్యలపై రైతులకు చేయూతనిస్తామని అన్నారు.
ఇదీ చూడండి. ఈ కష్టం ఎవరికీ రావద్దు.. అంత్యక్రియలకూ అష్టకష్టాలు