విశాఖ నగరం నడిబొడ్డున జగదాంబ జంక్షన్ సమీపంలో ఉన్న అత్యంత విలువైన అస్తులలో సింహాచల దేవస్ధానానికి చెందిన ప్రహ్లాద కళ్యాణమండం ఉంది. దశాబ్దాలుగా ఇందులో చేనేత, హస్త కళాకారుల ఉత్పత్తుల అమ్మకాలు ప్రదర్శనలు, ఇతరత్రా హిందూ, ధార్మిక కార్యక్రమాలు కొద్దిపాటి రుసుంతో చిన్న మధ్యతరగతి వారికి సౌకర్యవంతంగా సాగేవి. 2013లో కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్కు కొన్ని రోజులపాటు కార్యాలయంగా దీనిని కేటాయించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న సీఆర్పీఎఫ్ బెటాలియన్ తాత్కాలిక ఆశ్రయం కోసం ఈ కళ్యాణ మండపాన్ని ఇవ్వాలన్న అభ్యర్ధనను దేవాదాయ శాఖ కమిషనర్ మన్నించి కేటాయించారు. అప్పటినుంచి అద్దె కూడా చెల్లించడం లేదని దేవస్ధానం చెబుతోంది.
దాదాపు ఐదున్నర కోట్ల రూపాయిలు అద్దె రూపంలో చెల్లించాల్సి ఉందన్నది దేవస్ధానం వర్గాల అంచనా. కరోనా కష్ట సమయంలో ఆలయానికి వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. సగం జీతాలు కూడా చెల్లించలేని పరిస్ధితిలో ఉంది. ప్రస్తుతం ఈ తరహా బకాయిలు వసూలు చేయడం ద్వారా కొంత వరకు ఉపశమనం పొందే వీలుంటుందన్నది సిబ్బంది అంచనా. సీఆర్పీఎఫ్ బకాయిలు వసూలు చేసి ఈ మండపాన్ని ఖాళీ చేయిస్తే.... అత్యంత విలువైన దీనిని సాధారణ కార్యక్రమాల కోసం వినియోగించి ఆదాయం పొందవచ్చన్నది సిబ్బంది అంటున్నారు.
సీఆర్పీఎఫ్కి భూమి కేటాయించినా...
వాస్తవంగా సీఆర్పీఎఫ్కు దాదాపు 19 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం ముడసర్లోవ వద్ద కేటాయించింది. ఈ భూమి ఇంతవరకు వీరికి దఖలు చేసి, స్వాధీనం చేయకపోవడం వల్ల తాము అక్కడ ఏవిధంగా ముందుకువెళ్లేకపోతున్నామని సీఆర్పీఎప్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కళ్యాణ మండపం ఖాళీ చేయించి ఇప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కి దేవస్ధానం ఉద్యోగులు గతంలోనే మెర పెట్టుకున్నారు. గతేడాది దీనిని ఖాళీకి చర్యల కోసం తహసీల్దార్‌కి కలెక్టర్ ఆదేశించినా ఫలితం కానరాలేదు. సింహచలం ఎస్టేట్ ఆఫీసర్ కూడా ప్రస్తుతం ఎవరూ లేకపోవడం ఒక లోపంగానే ఉంది. ఈ అద్దె బకాయిల కోసం వారికి విజ్ఞప్తి చేస్తామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి: దేవాదాయశాఖ పరిధిలోకి శ్రీ ప్రేమ సమాజం