విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద 147 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి.. సీపీఐ నేత నారాయణ(cpi narayana) సంఘీభావం తెలిపారు.
విశాఖ ఉక్కుపోరాటంలో విద్యార్థి దశలోనే పాల్గొన్నామని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి విశాఖ ఉక్కును కాపాడాలని నారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై మాజీ ఎంపీ హరిబాబు కూడా స్పందించాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు అన్యాయం జరుగుతుంటే హరిబాబు స్పందించరా అని ప్రశ్నించారు. నిజంగా విశాఖపై ప్రేమ ఉంటే మిజోరం గవర్నర్ పదవి తిరస్కరించాలని నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ పోరాటానికైనా సీపీఐ సిద్ధంగా ఉందని .. అన్ని పార్టీలు స్పందించాలని నారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటం చేయాలని కోరారు.
సీఎం జగన్ నేరుగా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి తలచుకుంటే సమస్య పరిష్కరించగలరని అన్నారు. ఈ నెల 12న విజయవాడలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని.. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు.