విశాఖ జిల్లా ఎండాడ వద్ద చెరువును పూడ్చి రహదారిని నిర్మించారనే ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు. ఆర్డీవో కిశోర్ ఇప్పటికే ఒకసారి పరిశీలించారు. తరువాత జీవీఎంసీ, రెవెన్యూ వర్గాలు సర్వే చేశాయి. ఇక్కడ 1.62 ఎకరాల చెరువు మధ్యగా కొంత దారి నిర్మించారనే అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం దాదాపు రూ. 80 లక్షల జీవీఎంసీ నిధులు వ్యయం చేసినట్లు చెబుతున్నారు.
రోడ్డు నిర్మించగా మిగిలిన చెరువు ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేవని అధికారులు గుర్తించారు. పరిశీలనలో తేలిన మరిన్ని అంశాలతో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మధురవాడ జోన్-1 కమిషనర్ రాము మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గురువారం పరిశీలన చేస్తామన్నారు.ఆనందపురం మండలంలో కాలువ కప్పేసి రోడ్డు వేస్తున్న అంశం చర్చనీయాంశమవుతోంది.
పాలవలస పంచాయతీ మెట్టమీదపాలెం పొలాల నీరు, స్థానిక రొయ్యల కంపెనీ జలాలు, కొండ గెడ్డ ద్వారా వరదనీరు ఆనందపురం రెవెన్యూలోని ఈగలవాని చెరువుకు రావాల్సి ఉంది. ఇందుకు మార్గంగా ఉన్న గెడ్డలో కొంత భాగం కొందరు కప్పేశారు. ఇక్కడున్న లేఅవుట్‌కు సమీపంలో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. వీఆర్వో శ్రీనివాసరావు వద్ద ఈ అంశం ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. లొడగలవానిపాలెం పంచాయతీ కార్యదర్శి వద్ద ప్రస్తావించగా సమీపంలో లేఅవుట్ల నిర్మాణానికి ఎవరూ అనుమతి తీసుకోలేదన్నారు.
ఇదీ చదవండీ...