సింహాచలం భూముల్లోని ఆక్రమణలు గుర్తించేందుకు ప్రభుత్వం తిరుపతి భూముల పరిరక్షణ విభాగం ఎస్‌డీసీను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అయిదుగురు సభ్యులతో కూడిన పరిశీలన అధికారులు వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, అడవివరం, వెంకటాపురం గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. గతంలో నిర్మించినవి కాకుండా కొత్తగా వందకుపైగా అదనపు నిర్మాణాలు, మరికొన్ని స్థలాల్లో ఆక్రమణలు గుర్తించినట్లు తెలిసింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా అదనపు నిర్మాణాలు వెలుస్తున్నట్లు వారి దృష్టికి వెళ్లింది. ఇందులో కొందరి ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికైనా ఈ ఆక్రమణలను నిలువరించకపోతే.. ఇవి జరుగుతూనే ఉంటాయని, దీనికి పరిష్కారంగా ఇప్పటివరకు జరిగిన వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి ఇక జరగకుండా చూడాలని కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది.
క్రమబద్ధీకరణతో భవిష్యత్తులో జరిగే ఆక్రమణలను సులభంగా నివారించవచ్చని సూచించినట్లు సమాచారం. ఇందుకోసం జోన్ సర్వే చేపట్టి భూముల పరిరక్షణకున్న గార్డుల వ్యవస్థను బలోపేతం చేయడం, వారిపై రెండు స్థాయిల్లో పర్యవేక్షణ ఉండేలా అధికారులను నియమించడం వంటివి చేయాలని సూచించినట్లు తెలిసింది. పంచగ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు, దేవస్థానానికి మధ్య వివిధ న్యాయస్థానాల్లో 200లకు పైగా కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు అవసరమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఇప్పటికే పంచగ్రామాల సమస్యపై ప్రభుత్వం పలువురు ప్రజాప్రతినిధులతో సలహా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నివేదికను ఒక ఆధారంగా చేసుకొని ఈ సలహా కమిటీ తుది నిర్ణయం తీసుకోవచ్చని పలువురు భావిస్తున్నారు.
సింహాచలం అప్పన్న భూముల్లో అనుమతి లేకుండానే చాలామంది అదనపు నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. ఎప్పటికపుడు వీటిని అడ్డుకుంటున్నా మళ్లీ కొత్తగా పుట్టుకొస్తున్నాయి. పంచగ్రామాల్లో తాజాగా 146 అదనపు అంతస్థులు, కొత్త కట్టడాలు నిర్మించారంటే పరిస్థితి ఎంత చేయిదాటిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విలువైన స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. దేవస్థానానికి చెందిన భూమిగా సులభంగా గుర్తించేందుకు సరైన హద్దులు లేకపోవడంతో తమ స్థలమంటూ ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారు. ఉద్యోగులకు హద్దులపై స్పష్టత లేక వెంటనే గుర్తించకపోవడం, ఈలోగా నిర్మాణాలు చేపట్టడంతో ఏమీ చేయలేకపోతున్నారు. డబ్బు వ్యవహారాలు, రాజకీయ జోక్యం వంటివి ఉండడంతో ఉద్యోగులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన వాటిని పూర్తిగా పరిశీలించి నిలువరించకపోతే నిత్యం కొనసాగుతుంటాయి. ఇక్కడితో వీటికి స్వస్తి పలకాలి. ఇప్పటివరకు జరిగిన వాటిని క్రమబద్ధీకరించి ఇకపై జరగకుండా కఠిన ఆంక్షలు విధించడమే పరిష్కారమని తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యేక ఉప కలెక్టర్ సురేంద్ర దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన పరిశీలనలో గుర్తించిన అంశాలు ఇలా..
- పురుషోత్తపురం, వెంకటాపురం, చీమలాపల్లి, వేపగుంట, అడవివరంతో పాటు భూములున్న చోట 17 రోజుల పాటు ప్రత్యేక ఉపకలెక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు తహశీల్దార్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు.
- సింహాచలం భూముల్లో ఆక్రమణలు జరిగాయా లేదా?, నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి తీసుకున్నారా? వంటి అంశాలను ఆధారంగా చేసుకొని అధికారులు నివేదిక తయారు చేసినట్లు సమాచారం.
- చాలాచోట్ల కొత్తగా అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. అనుమతి లేకుండానే మొదటి అంతస్థులు నిర్మించడం, ఖాళీ స్థలంలో నిర్మాణాలు, అదనపు భవనాలు వంటివి చేపట్టారు.
- దేవస్థానానికున్న విలువైన భూములను గుర్తించేందుకు ఎక్కడా హద్దు రాళ్లు లేవు. దీనివల్ల పంచగ్రామాల్లో రైతుల పొలాలను ఆనుకొని ఉన్నవి ఆక్రమణకు గురయ్యే అవకాశముంది. హద్దు రాళ్లు లేకపోవడంతో స్థలం నాదంటే నాదని తరచూ సర్వే చేయడం వంటివి తలనొప్పిగా మారుతున్నట్లు గుర్తించారు. పురుషోత్తపురం, అడవివరం, వేపగుంట , మధురవాడల్లో విలువైన స్థలాలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయకుండా వదిలేశారు.
- ఉద్యోగులకు దేవస్థానం భూముల సరిహద్దులు పూర్తిగా తెలియకపోవడాన్ని గుర్తించారు. భూముల హద్దులు ఎక్కడి వరకున్నాయనే దానిపై స్పష్టత లేకపోవడాన్ని నివేదించారు. ఇందుకోసం డ్రోన్ సర్వే చేపట్టాలని సూచించినట్లు తెలిసింది.
- దేవస్థానం ఉద్యోగుల సంఘ భవనం పేరుతో వాణిజ్య సముదాయం నిర్మించడం, సంఘం భవనానికి అనుమతి ఒకచోట ఇస్తే మరోచోట నిర్మించడం చేయడాన్ని గుర్తించారు.
- భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సెక్యురిటీ గార్డుల వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇందుకు అదనంగా మరికొంతమందిని పెంచాలి. వీరిపై రెండు స్థాయిల్లో పర్యవేక్షణ ఉండాలి. క్లరికల్ స్థాయిలో ఒకరు, సూపరింటెండెంట్ స్థాయిలో మరొకరు ఉండేలా చేస్తే అదనపు నిర్మాణాలపుడు ఒక స్థాయిలో కాకపోయినా మరో స్థాయిలో ఇవి బయటపడే అవకాశముంటుంది.
- ముఖ్యంగా భూ వ్యవహారాలపై ప్రైవేటు వ్యక్తులతో దేవస్థానానికి 212 కేసులు నడుస్తుండడాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇవి తేలితేగాని ముందుకువెళ్లలేని పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి.
- 9వేల ఎకరాలకుపైగా ఉన్న భూముల దస్త్రాల నిర్వహణ సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఆక్రమణకు గురైనప్పటికీ అన్నీ దేవస్థానం ఆధీనంలోనే ఉన్నాయని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పంచగ్రామాల సమస్యపై ప్రజాప్రతినిధులతో ఏర్పాటైన కమిటీ ఓ తుది నిర్ణయానికి రావొచ్చు.
ఇదీ చదవండి: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన