CM Jagan Forgot the Promise of Uttarandhra Sujala Sravanthi Project : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయలేదంటూ నాటి సీఎం చంద్రబాబును ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఎలా కడిగిపారేశారో! ఇప్పటికిప్పుడు ఆ ప్రాజెక్టు పరిస్థితి చూస్తే జగన్‌ను పల్లెత్తు మాట అనాల్సిన అవసరమేలేదు. నాటి ప్రసంగం వీడియోను జగన్‌కే చూపిస్తే చాలు. ఎందుకంటే గద్దెనెక్కిన నాలుగేళ్లలో ఆప్రాజెక్టుకు జగన్ కూడా చేసిందేమీ లేదు. విశాఖకు మకాం మారుస్తా ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తా అంటూ మాటల్లో మురిపించడం తప్ప ఉత్తరాంధను సస్యశ్యామలం చేసే సుజల స్రవంతికి ఒరగబెట్టిందేమీ లేదు. ఈ నాలుగేళ్లలో అసలు అక్కడ పనులే చేయించలేదు. చేయిస్తే ప్రాజెక్టు కట్టాల్సిన ప్రాంతంలో పిచ్చిచెట్లు కనిపించేవి కావు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు ఇప్పటిదాకా మొత్తంగా జరిగింది కేవలం 0.27శాతమేనని అధికారిక గణాంకాలే కుండ బద్ధలు కొడుతున్నాయి. ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారులూ వెనక్కి వెళ్లి పోతున్నారు. భూసేకరణ ప్రక్రియలోనూ ఆలస్యం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు గోదావరి నీటిని తీసుకురావాల్సిన పోలవరం ఎడమ కాలువ పనులూ ఎక్కడికి అక్కడే ఆగాయి.
గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలకు తీసుకెళ్లేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. పోలవరం ఎడమ కాలువ నుంచి 63.2 టీఎంసీల నీటిని ఎత్తిపోసి కొంత మేర ఎత్తిపోతల ద్వారా,. మరికొంత గ్రావిటీ ద్వారా నీటిని తరలించి సాగుకు, తాగుకు ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. ఉత్తరాంధ్రలోని 3ఉమ్మడి జిల్లాల్లో 46 మండలాల్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు, 1037 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
తొలుత ఈ ప్రాజెక్టును 7వేల 214కోట్లతో చేపట్టేందుకు పాలనామోదం ఇచ్చినా పనులు ముందుకు సాగలేదు. 2018లో ఈ ప్రాజెక్టును రెండుదశల్లో చేపట్టాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 2వేల22 కోట్లతో తొలి దశలో లక్షా 30వేల ఎకరాలకు నీరిచ్చేలా 2ప్యాకేజీలుగా పనులు అప్ప చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక పనులేమీ జరగలేదు. రెండు దశలూ కలిపితే ప్రాజెక్ట్ అంచనా వ్యయం 17వేల 50 కోట్ల రూపాయలకు పెరిగింది.
నిజానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో కీలకం పోలవరం ప్రాజెక్టు.! పోలవరం ఎడమ కాలువ పూర్తైన తర్వాత ఆ కాలువ చివన 162వ కిలోమీటరు వద్ద నుంచి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్లలో పోలవరంఎడమ కాలువ పనులు చేపట్టిందీ లేదు, చేసిందీ లేదు. 2020-21 నుంచి ఇప్పటిదాకా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో 645 కోట్ల కేటాయింపులు చూపారు.! ఖర్చు చేసింది మాత్రం 18 కోట్ల 64 లక్ష రూపాయలు మాత్రమే!
భూసేకరణ చేయకపోవడంతో తొలిదశలో పనులు చేయడానికి లేక గుత్తేదారులు తమ వసతిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొందరు సమీప గ్రామంలో ఉంటూ కాలువలు, ప్రాజెక్టు డ్రాయింగ్, డిజైన్ పనులతో కాలక్షేపం చేస్తున్నారు. రెండో దశలో 3వేల800 కోట్ల విలువైన పనులు గుత్తేదారులు చేజిక్కించుకున్నా పనులు చేయడం లేదు. భూసేకరణ సమస్యే కారణమని చెప్తున్నారు. యంత్రసమీకరణ చేసినా భూములు అప్పగించకపోతే పనులు ఎలా చేస్తాం అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 16 వేల 46 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటిదాకా,.. 7వేల406 ఎకరాలకు సర్వే పూర్తిచేసి ల్యాండ్ పొజిషన్ షెడ్యూల్... విడుదల చేశారు. మిగతా 9వేల ఎకరాల సర్వే తుదిదశలో ఉంది.
Chandrababu Visits Polavaram: "పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్లొస్తున్నాయి"
నాలుగేళ్లలో పాలకులేంచేశారని నాడు పాదయాత్రలో ప్రశ్నించిన జగన్ మరి తాను అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఒక్క ముందడుగూ ఎందుకు వేయలేదన్నది సమాధానం దొరకని ప్రశ్న. బడ్జెట్‌లో ఏటా వందల కోట్లు కేటాయింపులు చూపి ఖర్చు చేయకపోవడం మభ్యపెట్టడం కాదా? కనీసం నిర్మాణానికి అవసరమైన భూములు సమకూర్చకపోవడం మోసగించడం కాదా? ఉత్తరాంధ్రపై జగన్ ప్రేమంతా ఉత్తదేనా? ఈ ప్రశ్నలకు వైకాపాలో సమాధానం చెప్పేవారి కోసం ఉత్తరాంధ్ర వేచిచూస్తోంది.
గుర్తుందా జగన్? : "విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని సబ్బవరం సమీపంలోని అయ్యన్నపాలెంలో రిజర్వాయర్‌కు దివంగత నేత రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన రోజు నాకు ఇవ్వాళ్టికీ గుర్తుంది. దివంగత నేత మన మధ్యలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ భూదేవి రిజర్వాయర్ పనులు అవుతాయో, లేవో అనే సందేహంతో రైతులున్నారు. నాలుగున్నరేళ్లు దాటిపోయినా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయాలన్న ఆలోచన, ఆరాటం చంద్రబాబుకు లేని పరిస్థితి కనిపిస్తోంది."-ప్రతిపక్షనేతగా సబ్బవరంలో జగన్