విశాఖ జిల్లాలోని మధరవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. అప్పుఘర్ ప్రాంతానికి చెందిన గ్రంధి సతీష్ డాక్‌యార్డులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య సుజాత, మూడేళ్ల కుమార్తె జాహ్నవిశ్రీ (3)... జోడుగుళ్లపాలెం ప్రాంతంలో ఉంటున్న ఆడపడుచు ఎం.వసంత, ఆమె ఏడేళ్ల కుమారుడితో కలిసి సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మధురవాడ పైవంతెన సమీపంలోని ఓ షాపింగ్‌మాల్‌కు వచ్చారు.
అక్కడ సామగ్రి కొనుగోలు చేశారు. తరువాత జాతీయ రహదారి దాటి అవతలి వైపు సేవా మార్గానికి వెళ్తుండగా.. నగరం నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. సుజాత, ఆమె ఆడపడుచు వసంత రోడ్డుపై తుళ్లిపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. తల్లి చేయి పట్టుకుని వస్తున్న చిన్నారి జాహ్నవి తలకు తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వీరి చేతిలో ఉన్న వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఎస్సై నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ వ్యక్తి లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కన్నీరుమున్నీరు
ఒక్కగానొక్క కుమార్తె.. తమకు దూరమై తిరిగిరాని లోకాలకు చేరుకుందంటూ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి సుజాత రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తమ్ముడి కుమార్తె కళ్లెదుటే మృతి చెందడంతో వసంత తట్టుకోలేక కళ్లు తిరిగి పడిపోయింది. స్థానికుల సపర్యలతో తేరుకుని బోరున విలపించింది.
ఇదీ చదవండి: