Cars crashed into fields: విశాఖ ఏజెన్సీ మార్గంలోని పాడేరు ఘాట్ రోడ్ కందమామిడి సమీపంలో.. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక రెండు కార్లు పొలాల్లోకి దూసుకుపోయాయి. ఇందులో ఒకటి బోల్తా పడగా.. మరొకటి బురదలో కూరుకుపోయింది. ఈ వాహనాల్లో.. వంజంగి పర్యాటక ప్రాంతాన్ని చూడటానికి పర్యాటకులు వచ్చారు.
దట్టంగా కమ్ముకున్న పొగ మంచు కారణంగా.. రహదారి కనిపించకపోవడంతో కార్లు పొలాల్లోకి దూసుకెళ్లాయి. అదృష్టవశాత్తూ చెట్లు, బండలు వంటివి ఏమీ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. కాగా.. ఆ కార్లలోని వారు వాహనాలను అక్కడే వదిలి వెళ్లిపోవడంతో.. వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ రహదారిలో చాలాసార్లు వాహనాలు బోల్తా పడుతున్నాయని స్థానికులు తెలిపారు. వేగంగా వచ్చే వాహనాలకు.. మలుపు తెలియక ప్రమాదాలకు గురవుతున్నాయని చెప్పారు. రెండు రోజుల కిందట కూడా ఒక కారు పొలాల్లోకి దూసుకుపోయిందని, ఇక్కడ హెచ్చరిక బోర్డులు కూడా లేవని చెబుతున్నారు.
ఇదీ చదవండి: accident at yedlapadu: ఆటోను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి