World Bank Disaster Management Grant: విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాశమార్గం పట్టిస్తామని వైకాపా మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా విశాఖ గర్జన పేరిట సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైకాపా ప్రభుత్వానికి విశాఖ అభివృద్ధిపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజెప్పే ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విశాఖలో తీర కోత నియంత్రణ ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మంగళం పాడేసింది. ఫలితంగా గ్రాంటు రూపంలో రావాల్సిన 125 కోట్ల రూపాయలు చేజారిపోయాయి. విశాఖ నగరం తరచూ తుపానుల బారిన పడుతుంటుంది.
హుద్‌హుద్ లాంటి అతి తీవ్ర తుపాను ఇక్కడే తీరం దాటింది. 2015లో నీలం, పైలిన్ తుపానులు, ఆ తరువాత ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆర్కే బీచ్, గోకుల్‌పార్కు, తెన్నేటి పార్కు, రుషికొండ, భీమిలి ప్రాంతాల్లో తీరం భారీగా కోతకు గురైంది. ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు వచ్చి రహదారిపైకి నీరు చేరింది. 200 మీటర్ల దూరంలో ఉన్న రక్షణగోడ, నడక మార్గం, కొంతమేర రహదారి ధ్వంసమైంది. నాటి కలెక్టర్ యువరాజ్, కమిషనర్ ఎంవీ సత్యనారాయణ తీరం కోత నియంత్రణపై దృష్టి పెట్టారు.
విపత్తుల నియంత్రణలో భాగంగా నిధుల కోసం అధికారులు ప్రపంచ బ్యాంకును సంప్రదించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు తీరంలో అలల ఉద్ధృతిపై అధ్యయనం చేయడానికి నెదర్లాండ్స్‌కు చెందిన డెల్టారస్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. రెండు నివేదికలు ఇవ్వడానికి ఆ సంస్థకు కోటీ 40 లక్షలు చెల్లించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అధ్యయనం కొంత పూర్తయిన తరువాత ప్రభుత్వం 70 లక్షల రూపాయలు చెల్లించడంతో మొదటి నివేదికను డెల్టారస్ సమర్పించింది. రెండో నివేదిక సమర్పించాలంటే మరో 70 లక్షల రూపాయలు చెల్లించాలి.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలుమార్లు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సమర్పించాలని కోరినా ప్రస్తుత ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఇటీవల తీర కోత నియంత్రణ ఒప్పందం నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగిందని జీవీఎంసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. జీవీఎంసీ సాధారణ నిధులను వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో 2015లో అప్పటి అధికారులు తెదేపా ప్రభుత్వంతో చర్చించి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం డెల్టారస్‌తో చర్చించకపోవడం, సకాలంలో 70 లక్షల రూపాయల నిధులు ఇవ్వకపోవడంతో 125 కోట్ల నిధులు చేజారిపోయాయి. తీర కోత నియంత్రణ ప్రాజెక్టుపై ప్రభుతాన్ని పలుమార్లు సంప్రదించినా స్పందన లేకపోవడంతో డెల్టారస్ సంస్థకు నిధులు చెల్లించలేకపోయామని.. మహా విశాఖ నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: