"ఏ ప్రభుత్వమైనా మంచి కార్యక్రమంతో పాలనకు శ్రీకారం చుట్టాలి.. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో పాలన ప్రారంభించింది" అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న అచ్చెన్న.. పన్నులు, చార్జీలతో ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చారని మండిపడ్డారు. మోసపూరిత సంక్షేమం పేరుతో ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ పథకాలపై సొంత పత్రికకు కోట్లాది ప్రకటనలు ఇస్తూ.. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల డబ్బును దోచిపెడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చిన.. రివర్స్ టెండరింగ్ పథకమే రాష్ట్రాన్ని పూర్తిగా రివర్స్‌లోకి తీసుకెళ్లిందని విమర్శించారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు గుత్తేదారులను తప్పించి.. సొంత వ్యక్తులకు వాటిని కట్టబెట్టి.. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులను సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వీరబాదుడు కార్యక్రమం చేపట్టి.. రాష్ట్రంలో నిత్వావసరాల ధరలను అమాంతం పెంచారని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సెస్ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహింరిస్తుందని మండిపడ్డారు.
ఇదీ చదవండి: