ఆరు సార్లు ఎంపీగా..
వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్... దశాబ్దాల రాజకీయంతో పాటు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న నేత. 1977లో తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆయన... 5సార్లు లోక్‌సభ, ఒకసారి రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. 1979-80లో కేంద్ర సహాయ మంత్రిగా, యూపీఏ-2 హయాంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతగా... గిరిజనులకు సంబంధించి జాతీయస్థాయి కమిటీలలో క్రియాశీలకంగా పని చేసిన అనుభవం చంద్రదేవ్ సొంతం. అపార అనుభవం ఉన్న ఆయనకు 2014 ఎన్నికలు చేదు ఫలితాలను అందించాయి. విభజన అపవాదు మూటగట్టుకున్న కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
కాంగ్రెస్ వీడి సైకిల్ ఎక్కి..
నాలుగున్నరేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న కిషోర్ చంద్రదేవ్.... ఎన్నికల వేళ సైకిల్ ఎక్కేశారు. పార్టీలో చేరిన ఆయనకు అరకు ఎంపీ స్థానాన్ని కట్టబెట్టింది తెదేపా అధినాయకత్వం. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ఇప్పుడు కూతురు శృతిదేవి వార్తల్లో వ్యక్తయ్యారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తండ్రిపై పోటీకి సిద్ధమైపోయారు.
సమస్యలపై పోరాటం
కిశోర్ చంద్రదేవ్ కూమార్తెగానే కాకుండా... స్థానికంగా ఉండే గిరిజనుల సమస్యలపై పోరాడుతున్న వ్యక్తిగా శృతిదేవికి పేరుంది. దేశ రాజధాని దిల్లీతోపాటు విదేశాల్లోనూ ఉన్నత విద్యను కొనసాగించారు. భూమి, పర్యావరణ సంబంధ అంశాలపై ఫ్రీలాన్స్ రైటర్‌గా తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కురుపాం వేదికగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ గిరిజనుల హక్కులపై గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఈమెను తెలిసిన వారంతా పట్టామహాదేవిగా పిలుస్తారు.
సులువేం కాదు...
విస్తీర్ణంలో దేశంలోనే రెండో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైనఅరకు పార్లమెంట్ స్థానం అటు శ్రీకాకుళం జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో ఉండే నియోజకవర్గాల్లో 6 స్థానాలు ఎస్టీ, ఒక స్థానం ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి. ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవటం అంతా సులువేం కాదు. కిందటి ఎన్నికల్లో వైకాపా ఇక్కడ జయకేతనం ఎగరేసింది. అయితే ఈ దఫా తెదేపా పార్లమెంట్ పరిధిలో బలమైన అసెంబ్లీ అభ్యర్థులను నిలిపింది. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు కూడా తమ గెలుపునకు దోహదం చేస్తాయని తెదేపా భావిస్తోంది. వైకాపా తరపున కొత్త అభ్యర్థి మాధవి రంగంలో ఉన్నారు. జాతీయ స్థాయి రాజకీయాలను అవపోసాన పట్టిన కిశోర్ ఒక పక్క పోటీలో ఉండగా.. ఇప్పుడే బలపం పట్టిన కూతురు శృతిదేవి తండ్రిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి కలిగిస్తోన్న అంశం. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న మాధవికి కూడా రాజకీయాలు కొత్తే..!