MLA Anam Sensational Comments: తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ప్రభుత్వంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ వాలంటీర్లు, వైకాపా సమన్వయకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఆళ్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం చెరువుకు 3 ఏళ్లుగా నీళ్ళు రాలేదని.. దీంతో రైతులు 300 ఎకరాల్లో పంటలు వేయలేదన్నారు. దీనికి రైతులు పరిహారం అడుగుతున్నారన్నారు. రిజర్వాయర్ పనుల జోలికి పోలేదని, అటు రైతులకు ఏమి చెప్పాలని ప్రశ్నించారు.
తాను అందరి మాదిరి ఎమ్మెల్యేను కాదన్న ఆయన.. అందుకే ఏ ఊరికి వెళ్ళినా తనను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు.. వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానని మన వాళ్ళల్లో ఒకరు చెబుతున్న వార్తలు వస్తున్నాయని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కొత్త ఎమ్మెల్యేను మీరే పెట్టేశారా అంటూ పరిశీలకుడిని ఆనం రామ నారాయణరెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో సమన్వయ లోపం ఉందని పేర్కొన్నారు. గతంలో ఒకరు తానే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రచారం చేశారని.. ఆ వ్యక్తి సగంలోనే పారిపోయారని విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా ఉండగానే మరొకరు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పడమేంటని ప్రశ్నించారు. వెంకటగిరిలో రాజకీయ పరిస్థితులపై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని ఆనం డిమాండ్ చేశారు.
ఏడాది తర్వాత వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే కుర్చీ లాగేస్తున్నారని నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఏడాది వరకు తనకు సమయం ఉందని పేర్కొన్నారు. సంవత్సరం తర్వాత ఇక్కడే ఉంటానో.. మరోచోటకు వెళ్తానో? అప్పుడు తెలుస్తుందని ఆనం వెల్లడించారు. నేను ఉన్నంతవరకు నా కుర్చీ నాదే అంటూ ఆనం పునరుద్ఘాటించారు.
ఇవీ చదవండి: