Hathiram Matt Fit Person: దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ఈవో రమేశ్ నాయుడు హథీరాంజీ మఠం ఫిట్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతిలోని హథీరాంజీ మఠం తలుపులు సోమవారం తెరిచారు. అనంతరం ఫిట్ పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన మఠానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మఠంలోని సిబ్బందితో మాట్లాడారు. 2022 నుంచి ఇప్పటివరకు ప్రతి రోజు 50వేల నుంచి 70 వేల రూపాయల వరకు వస్తున్న ఆదాయానికి సంబంధించి లెక్కలు ఉన్న వాటిపై సంతకాలు లేకపోవడం ఏంటని సిబ్బందిని ప్రశ్నించారు.
మఠానికి సంబంధించిన ఆస్తులు, భూములు, దుకాణాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మఠం మహంత్ అర్జున్ దాస్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను ధార్మిక పరిషత్ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఐదు రోజుల క్రితం సస్పెండ్ చేసింది. గురువారం రాత్రి సస్పెండ్ ఉత్తర్వులు ఇచ్చేందుకు మఠానికి చేరుకున్న దేవాదాయ శాఖ అధికారులు.. మహంత్ లేకపోవడంతో ఆయన నివసించే గదికి సస్పెండ్ ఉత్తర్వులు అంటించారు. శుక్రవారం మఠానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ఈవో రమేష్ నాయుడు ఫిట్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
హథీరాంజీ మఠం భూములు.. అన్యాక్రాంతం..కాగా.. హథీరాంజీ మఠానికి గల విలువైన భూముల్లో చాలావరకు ఇప్పటికే అన్యులపరమైపోయాయి. కొన్ని ఏళ్ల నుంచి సాగిన ఈ ఆక్రమణపర్వంలో వేల కోట్ల ఆస్తులు కరిగిపోయాయి. మిగిలిన భూములపై కూడా సరైన రికార్డుల్లేవు. దీంతో మహంతు అర్జున్‌దాస్‌పై నమోదైన పలు అభియోగాల నేపథ్యంలో ఆయన్ని మఠం బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఈ నెల 8న ధార్మిక పరిషత్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.
అతని స్థానంలో దేవాదాయ శాఖ తరపున ఫిట్ పర్సన్‌గా పెనుగంచిప్రోలు ఆలయ ఈవో (డిప్యూటీ కలెక్టర్) రమేశ్‌నాయుడిని నియమించింది. మహంతు చేతుల నుంచి మఠాన్ని తన అధీనంలోకి తీసుకున్న దేవాదాయ శాఖ ముందు ఇప్పుడు పెద్ద సవాళ్లే ఉన్నాయి. మఠం కార్యకలాపాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు ఏం చేయగలదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు చెందిన వేల ఎకరాలు ఆక్రమణల్లో ఉంటేనే.. దేవాదాయ శాఖ రక్షించలేకపోతోంది.
కొన్నిచోట్లైతే కబ్జాదారులకు అధికారులే సహకరిస్తున్నారు. తిరుపతి రూరల్, అర్బన్ పరిధిలో మఠం భూములపై రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు కన్నేసి ఉంచారు. కాగా.. ఇప్పుడు వారిని అధికారులు అడ్డుకోగలరా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. భూములను లీజుల పేరిట తీసుకొని, ఆక్రమించి భారీ భవంతులు కట్టుకున్న వారి నుంచి ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం సాధ్యమేవుతుందా..? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.