Nennoor Villagers Protest: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. ఈరోజు ఉదయం నెన్నూరు గ్రామంలో టిప్పర్ ఓ మహిళను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహిళను ఢీకొట్టిన డ్రైవర్.. టిప్పర్‌ను ఆపకుండా వెళ్లడంతో గ్రామస్థులు ఆగ్రహించారు. టిప్పర్లను రోడ్డుపై నిలిపివేసి నిరసన తెలిపారు.
అనంతరం గాయపడ్డ మహిళను గ్రామస్థులు తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రెండు సంవత్సరాలుగా టిప్పర్ల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువైందన్నారు. గ్రామంలో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా అధికారులు రావడం, గ్రామస్థులకు సర్ది చెప్పడంతోనే సరిపోతుందని.. టిప్పర్లు ఇటు వైపు రాకుండా చేయడం అధికారులకు సాధ్యపడలేదని వారు గోడును వెళ్లబోసుకున్నారు.
వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు.. గుట్టలు, కొండలను గుళ్ల చేస్తున్నా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని మండిపడ్డారు. గ్రామస్థుల, పోలీసుల మధ్య మాటా మాటా పెరగడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇకపై టిప్పర్లు రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. ఇకనైనా మట్టి మాఫియాను కట్టడి చేసి టిప్పర్లు నెన్నూరు గ్రామం వైపు రాకుండా చూడాలని, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి