Autos In Visakhapatnam And Vijayawada Cities : 'గుంటూరులో మనుషుల కన్నా ఆటోలు ఎక్కువ' అని ఇటీవల ఓ సినిమాలో డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. అంటే అక్కడ ఎటు చూసినా ఆటోలు కనిపిస్తాయని సెటైరికల్‌గా చెప్పారు. కానీ మహానగరాలుగా విస్తరిస్తున్న విశాఖ, విజయవాడలో మాత్రం జనాభాకు తగినన్ని ఆటోలు లేవని రవాణాశాఖ అధికారులు తేల్చారు. ఈ రెండు నగరాల్లో ఆటోల సంఖ్య పెంచేలా చర్యలకు సిద్ధమయ్యారు. ఎక్కడివారైనా ఈ రెండు నగరాల్లో ఆటోలు నడుపుకోవచ్చని కొత్త ప్రతిపాదన సిద్ధం చేశారు. కాకపోతే CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు.
ఆటోల సంఖ్య పెంచేలా కసరత్తు : విశాఖ, విజయవాడ మహానగరాల్లో జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ రెండు నగరాల్లో సిటీ బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదు. అందుకే ఆటోల సంఖ్య పెంచేలా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేస్తోంది. ఇప్పటి వరకు నగర జనాభాకు అనుగుణంగా ఆటోల సంఖ్య నిర్ణయించి పోలీసులు, రవాణాశాఖ అధికారులు ప్రత్యేక నెంబర్లు కేటాయించి ఆటోలు తిరిగేందుకు అనుమతిస్తున్నారు.
"ఆటో"పై 4 ఇన్ ఆల్ అంటే- 4X6=24 అని అర్థమట! - Dangerous traveling
ఎవరైనా ఆటోలు నడుపుకునేలా : అయితే విజయవాడ, విశాఖ నగరాల్లో స్థానిక ఆటోలకు మాత్రమే అధికారులు ఇప్పటి వరకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలు నగరంలోకి రాకుండా కట్టడి చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పెరిగిన జనాభాకు తగినన్ని ఆటోలు ఆయా నగరాల్లో లేవని నిర్థరించిన అధికారులు రిజిస్ట్రేషన్ నెంబర్లతో సంబంధం లేకుండా ఎవరైనా ఆటోలు నడుపుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో అనుమతుల కోసం రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
CNG, ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే : ఆటోలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆటోల సంఖ్య పెంపు ద్వారా దీనికి అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే మహానగరాల్లో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజిల్ ఆటోలకు అనుమతివ్వడం లేదు. కేవలం CNG, ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఆటోకార్మిక సంఘాల అభిప్రాయం తీసుకోవడంతో పాటు ఈ రెండు నగరాల్లో సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
వయనాడ్ బాధితులకు అండగా 'రాజీ'- సండే, మండే సంపాదనంతా డొనేట్ చేసిన ఆటో డ్రైవర్!