NAIDUPETA-RENIGUNTA NATIONAL HIGHWAY: తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు ఆరు వరుసల 71వ జాతీయ రహదారి నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే నాయుడుపేట పురపాలక సంఘం జువ్వలపాళెం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జిని ఇక్కడి రోడ్డు కంటే లోతట్టుగా ఏర్పాటు చేయడంతో స్థానికులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో హైవే పర్యవేక్షణ బృందం అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్రిడ్జి ఎత్తు పెంచే అవకాశం లేదని.. అయితే కింది భాగంలో నీరు నిల్వకుండా డ్రైనేజీ కాల్వలు కడతామని వారు అన్నారు. అలాగైతే ధాన్యం లారీలు, వాహనాల రాకపోకలు ఎలా సాగించాలని రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అవతలి వైపు ఉన్న శ్శశాన వాటికలకు వెళ్లేందుకు కూడా దారి సదుపాయం లేకుండా చేశారని స్థానికులు వాపోయారు. జాతీయ రహదారి పనులు చేయటం వల్ల కొంత దూరం పాటు రాంగ్ రూట్లో రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రహదారికి ఇరువైపులా రైతుల పొలాలు ఉండటంతో సాగు సమయంలో అటూ.. ఇటూ వచ్చి పోయేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి పనులు వల్ల పంటల సాగు కష్టంగా మారిందని తెలిపారు. దుమ్ముతో తిప్పలు పడుతున్నామని, పంట దిగుబడి కూడా పడిపోయిందని తెలిపారు.
పొలాలు పొడవునా సర్వీసు రోడ్డుకి ఒకచోట అండర్ పాస్ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నాయుడుపేట పురపాలక సంఘం అభివృద్ధి చెందే సమయంలో రోడ్డు అడ్డుకట్టగా మారిందని, దీనివల్ల అపార్ట్మెంట్స్, వ్యావార సంస్థలు నిర్మించలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఆగిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ మేరకు అండర్ పాస్ సర్వీసు రోడ్డు వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ రహదారి పొడవునా పంట కాల్వల నీరు పారేలా చిన్న కల్వర్టులు కడుతున్నారు. కాల్వ ఒకచోట వెళ్తుంటే మరో చోట వీటిని లక్షలాది నిధులతో పలు చోట్ల ఏర్పాటు చేశారు. ఇక రహదారికి తరలిస్తున్న గ్రావెల్లో బండ చెక్కరాళ్లు తోలి.. కింది భాగంలో వేస్తున్నారు. వాగులు వంకలు వెళ్లే చోట కట్టే బ్రిడ్జిలతో వరద నీరు పంట పొలాల్లో పారుతోంది. రహదారి పొడవునా ఒకవైపు పనులు మరో వైపు ఎత్తు పల్లాలుగా ఉండటంతో పాటుగా రహదారి ఇరుకుగా మారి దెబ్బతినడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారితో రైతులు, ప్రజలకు మేలు జరగాలి కానీ ఇలా ఇబ్బందులు ఉండకూడదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై జాతీయ రహదారి పర్యవేక్షణ బృందం ఈటీవీకి వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
"ఈ నేషనల్ హైవేకు అండర్ బ్రిడ్జ్ లేదు. దీంతోపాటు హైవేకు ఒక్క యూ టర్న్ కూడా లేదు. ఈ అంశాల గురించి మేము అధికారులను అడిగితే ఇది ఎక్స్ప్రెస్ హైవే.. దీని పైన ఎటువంటి యూ టర్న్ ఇచ్చేందుకు వీలుపడదని అంటున్నారు. ఈ రహదారి వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు, రైతులు రాకపోకలు సాగించేందుకు ఆస్కారం లేదు. అందువల్ల మాకు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి సర్వీసు రోడ్డు వసతి కల్పిస్తే చేస్తే బాగుంటుంది." - వెంకటరమణయ్య, జువ్వలపాళెం సర్పంచి