శ్రీకాకుళం జిల్లాలో అవసరాలకు తగిన విధంగా కూరగాయల సాగు లేకపోవటంతో డిమాండ్ పెరుగుతోంది. ఇతర ప్రాంతాలు నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి రావటంతో రోజుకో ధర మార్కెట్లో పలుకుతోంది. పేద మధ్యతరగతి జనాలకు పెనుభారంగా పరిణమిస్తోంది. కరోనాతో ఉపాధి పోయి చాలా మంది కుదేలయ్యారు. జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. కొనలేక తినలేక సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నాడు. ఓపక్క కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు పెరిగిన ధరలు మరింత భారమయ్యాయి. జిల్లాలో తగ్గిన సాగు విస్తీర్ణం, దళారులు ధర నిర్ణేతలు కావడం, ఇతర ప్రాంతాల దిగుమతులపై ఆధారపడటం వంటి పరిస్థితులు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
రైతు బజార్‌ల్లో ఒక మాదిరిగా ఉన్న రేట్లు.. బయట మార్కెట్‌ల్లో ధర నియంత్ర లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. ఏ కూరగాయలు ఏంత రేటు ఉంటాయో తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా అమ్మడంతో.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
జిల్లాలో కూరగాయల సాగు చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం బెండ, వంకాయలు, బీర, కాకర, అతి తక్కువ మోతాదులో విపణికి చేరుతోంది. సికింద్రాబాద్ నుంచి క్యారెట్.. బెంగళూరు, మదనపల్లె నుంచి టమాటా.. క్యాబేజీని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రప్పిస్తున్నారు. దొండ కృష్ణా, పశ్చిమగోదావరి నుంచి తీసుకొస్తున్నారు. బంగాళదుంప పశ్చిమబంగ నుంచి ఉల్లి కర్నూలు, మహారాష్ట్ర నుంచి.. క్యాప్సికమ్ బెంగళూరు నుంచి దిగుమతి అవుతోంది. చిక్కుడుకాయలు కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి చేరుతున్నాయి. దిగుమతితో రవాణా ఛార్జీలు తోడై ధరలు పెరగటానికి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ధరల పెరుగుదల, నియంత్రణ, బ్లాక్ మార్కెట్ తదితర అంశాలపై చర్చించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేసే కమిటీ జాడ కనిపించడం లేదు. నెలకోసారి పెరుగుతున్న ధరలు, నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించే సమావేశాలు జరిగిన దాఖలాలు లేవు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి తహసీల్దార్ ఆధ్వర్యంలో అధికారులు, అన్ని పార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించే ఆహార సలహా సంఘ సమావేశాలు నిలిచిపోయాయి. వీటి నిర్వహణపై జిల్లా అధికారులు కూడా కనీసం పర్యవేక్షించకపోవటంతో వ్యాపారులు అక్రమంగా సరకులు నిల్వ చేసి ధరలు పెంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు