ఆ మూడు రోజులు లాక్‌డౌన్ : ఊళ్లో వాళ్లు బయటకెళ్లరు.. బయట వాళ్లను రానివ్వరు..! - శ్రీకాకుళం గ్రామ దేవత పూజలు
తూర్పు కనుమల్లో నివసించే ఆదివాసీల జీవనశైలి వైవిధ్యభరితం.. వారి ఆచార అలవాట్లు విచిత్రంగా ఉంటాయి. సంప్రదాయ పండుగలకు పెద్దపీట వేసే సంస్కృతిని వీరు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఐదేళ్లకు ఓసారి మూడు రోజులపాటు ఊళ్లోకి ఎవరినీ రానీయకుండా వారు తమ సంప్రదాయ దేవతలకు పూజలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గిరిజన పల్లెలోని ఆదివాసీల పూజలపై స్థానికంగా వదంతులు వ్యాపించాయి. వీరి పూజలపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.
![ఆ మూడు రోజులు లాక్‌డౌన్ : ఊళ్లో వాళ్లు బయటకెళ్లరు.. బయట వాళ్లను రానివ్వరు..! ఆ మూడు రోజులు లాక్‌డౌన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15095198-613-15095198-1650708948823.jpg?imwidth=3840)
సిక్కోలు ఆదివాసీలు తమ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ఎన్నో పండగలను ఈనాటికీ కొనసాగిస్తున్నారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గిరిజన గ్రామంలో తాజాగా గ్రామదేవత పూజలు జరిగాయి. వీరికి ఎన్నో పండుగలు ఉన్నా.. ఐదేళ్లకోసారి చేసే ఈ గ్రామ దేవత పూజలు మాత్రం ప్రత్యేకం. ఈ మూడు రోజులు గ్రామాన్ని వారు లాక్‌డౌన్ చేసేస్తారు. ఊళ్లో వారు బయటకు వెళ్లరు. బయటవారిని ఊళ్లోకి రానివ్వరు. ఈ నిబంధనకు అధికారులు కూడా అతీతులు కారు. అందుకే గ్రామంలోకి ఇతరులు ప్రవేశించకుండా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి మూడు రోజులు సెలవు ప్రకటించారు. సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వాలంటీర్లు కూడా ఈ మూడు రోజులు రావద్దని సూచించారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే వెన్నెలవలస గిరిజన గ్రామంలో జరిగిన గ్రామదేవత పూజలపై స్థానికంగా వదంతులు వచ్చాయి. ఒడిశాకు చెందిన మాంత్రికులతో గ్రామంలో క్షుద్రపూజలు నిర్వహించారని ప్రచారం జరిగింది. జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించటంతో... రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గిరిజనలు రహదారికి ఏర్పాటు చేసిన ముళ్ల కంచెలు తొలగించారు. గిరిజనులు మాత్రం ఆచారం ప్రకారం గ్రామదేవత పండగ జరుపుకున్నామని చెబుతున్నారు. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే గ్రామదేవత పండగకు నిర్వహించుకుంటున్నామని చెబుతున్నారు.
ఐదేళ్లకోసారి గ్రామాన్ని లాక్‌డౌన్ చేసి చేసే ఈ గ్రామదేవత పూజల వల్ల గ్రామానికి మంచి జరుగుతుందన్నది వెన్నెల వలస వాసుల విశ్వాసం. పంటలు బాగా పండేందుకు, ఊరంతా సుఖసంతోషాలతో ఉండేందుకు దేవతల అనుగ్రహం కోసమే ఈ పూజలు చేశామంటున్నారు.
ఇదీ చదవండి: పెళ్లికి వయసేంటి.. మనసే ముఖ్యమని కొటేషన్ చెప్పింది.. క్లైమాక్స్ ఏంటో తెలుసా?