శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తుండగా, తమకున్న ఒకే ఒక్క ఖాళీ స్థలాన్ని ఆడుకొనేందుకు వదిలేయాలని విద్యార్థులంతా ఇటీవల కలెక్టర్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా మొరపెట్టుకొన్నారు. ఇదే విషయాన్ని ఈనెల 25న ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భారత్‌లో ‘కలెక్టర్ గారు...ఆడుకోనివ్వరూ...! అనే శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై సీఎంవో కార్యాలయం ఆరా తీసింది.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, టెక్కలి సబ్ కలెక్టర్ వికాశ్‌మర్మత్ శనివారం సంతబొమ్మాళిలో పర్యటించి వివరాలను తెలుసుకొన్నారు. అనంతరం ఆట స్థలాన్ని పరిశీలించి కొండ పోరంబోకు-సర్వే నంబర్-287లో ఉన్న 80 సెంట్లను సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఆట స్థలంగా వినియోగించుకొనేలా చూడాలని తహసీల్దార్ ఆదిబాబుకు సూచించారు. దీంతో అధికారులు హుటాహుటిన ఈ వివరాలతో ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో విద్యార్థులు, ఈ ప్రాంత యువకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచి కళింగపట్నం లక్ష్మి, యువకులు, విద్యార్థులు కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి
viral video: ఆట స్థలంలో కోల్డ్ స్టోరేజీ వద్దు: వైరల్‌గా మారిన చిన్నారుల వీడియో