DAMAGED ROADS IN SRIKAKULAM: "ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. కారణం సంస్కరణలను అర్థం చేసుకోలేకపోవటం.. ఏదైనా ఒకేసారి అయిపోదు. ముఖ్యంగా మూడు సంవత్సరాలలోనే అయిపోదు. రోడ్లు కన్నాలు పూడ్చటం పూర్తైంది. గత మూడు సంవత్సరాల క్రితం వరకు ఉన్నది తెదేపా ప్రభుత్వమే కదా. మరీ ఇన్ని కన్నాలు ఏలా ఏర్పడ్డాయి. అవన్నీ మేము ఏర్పాటు చేసిన కన్నాలా.. అవి గతంలో ఉన్నవే కదా.. కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా అయి ఉంటాయి.. పని చేయటం జరుగుతుంది. రోడ్లు వేయటం జరుగుతుంది.. నియోజకవర్గంలో ఏక్కడైనా కన్నాలు ఉన్న రోడ్లుంటే చూపించండి" ఇవి శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్ల గురించి మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటల గారడీ. కానీ, పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు. అన్నింటి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది.
శ్రీకాకుళం పరిధిలోని కోళ్లపేట గార రోడ్డు కచ్చ రోడ్లలాగా మారిపోయాయి. ఇంతకముందు ఇది రోడ్డు అంటే నమ్మలేనంతగా తయారయ్యాయి. అసలు రోడ్డు అనడానికి వీల్లేనంత దారుణంగా దెబ్బతిని పూర్తిగా కంకర తేలిన మార్గంలో ప్రయాణం అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోడ్డు గురించి జనం ఏమంటున్నారో వారి మాటల్లోనే.
"రోడ్డు పైన కంకర తేలి ఇబ్బందిగా ఉంది. కిందపడిపోయే ప్రమాదం ఉంది. కొంచెం వాన పడినా ఈ మార్గంలో రావటానికి కష్టంగా ఉంది. వేరే మార్గాల గుండా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వాహనాల టైర్లకు రాళ్లు గుచ్చుకుని దెబ్బతింటున్నాయి. ద్విచక్ర వాహనాల వెనుక కూర్చున్నవారు కిందపడిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు."-రామారావు, కోళ్లపేట
తండేవలస-సింగపురం రోడ్డు పరిస్థితి మరింత దారుణం. ఈ మార్గంలో కనీసం కంకర కూడా లేదు. పెద్దపెద్ద గోతులు, దుమ్ము-ధూళి తప్ప.. వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేదు. ఇలాంటి చోట వర్షం వచ్చిందంటే ఆ బాధ చెప్పలేనిది అని స్థానికుల మూకుమ్మడి అభిప్రాయం.
"సింగపురం నుంచి తండేవలస వెళ్లే రోడ్డు బాగాలేదు. ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా కనీసం పట్టించుకోవటం లేదు. ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయి. వర్షం పడితే మొత్తం బురదతో నిండి ఉంటుంది." -పాపారావు, తండేవలస
"పల్లెవలస నుంచి సింగపురం వెళ్లే రోడ్డు అస్సలు బాగాలేదు. ఈ రోడ్లలో ప్రయాణం చేయటం మహిళలకు ఇబ్బందిగా ఉంది. రోడ్లు బాగాలేక ఏదైనా వాహనం వెనక వెళ్తే కళ్లలో దుమ్ము పడతోంది. వర్షం పడితే బురదతో నిండిపోతున్నాయి. మంత్రులు హైవే రోడ్లపైన వెళ్తుంటారు. ఒకసారి ఈ రోడ్లపై వెళ్తే మా కష్టాలు తెలుస్తాయి." -శేఖర్, పల్లెవలస
మామిడివలస - కిష్టప్పపేట రోడ్డుది మరో కథ. ఒక్క వాహనం మాత్రమే వెళ్లగలిగే రోడ్డుపై గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. అలాంటి రోడ్డు పక్కనే చెరువు ఉంది. కొంచెం అటుఇటు అయిందంటే ఇక అంతే సంగతులు అంటున్నారు ప్రజలు.
"మేము రోజు ఈ రోడ్డుగుండా పాఠశాలకు వెళ్తుంటాము. నేను సైకిల్ పైన వెళ్తుంటాను. రోడ్డు చిన్నదిగా ఉంది. అలాగే రోడ్డు పక్కనే చెరువు ఉంది. ఏదైనా వాహనం వస్తే పక్కకు జరగాలంటే భయంగా ఉంది." -మణికంఠ, విద్యార్థి, మామిడివలస
ఇక హుకుంపేట రోడ్డు పరిస్థితి మరింత అధ్వానం. పూర్తిగా కంకర తేలిన ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే అమ్మో అనే పరిస్థితి. కొత్త రోడ్డు మాట దేవుడెరుగు.. చిన్నపాటి మరమ్మతులైనా చేయండి మహాప్రభో అని నెత్తీనోరు బాదుకుంటున్నారు.
"ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కూడా చెప్పాము. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప పరిష్కారం చూపటం లేదు. నాలుగురోజుల క్రితమే ఈ రోడ్డుపై వెళ్తూ కిందపడ్డాను.. గాయాలయ్యాయి." - చందర్రావు, హుకుంపేట
ఇవీ చదవండి: