ఏన్నో కలలతో అత్తింటిలో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం వేధింపులే ఎదురయ్యాయి. అత్తమామలు ఇబ్బందులకు గురి చేశారు. ఆదరించాల్సిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి నరకం చూపించాడు. వీటిని తాళలేక పోయిన ఆ భార్య.. కన్న బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
క్షణికావేశంలో నిర్ణయం..
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని నవమాసాలు మోసి అపురూపంగా పెంచిన పిల్లలను కూడా తనతో తీసుకువెళ్లాలని తాను పడ్డ అవమానాలు, బాధలు.. తన పిల్లలకు వద్దనుకుంది. కటువైన హృదయంతో వారినీ తనతో పాటు తీసుకు వెళ్లిపోయింది. తను లేని ఈ లోకంలో కర్కశత్వం మధ్య తన చిన్నారులు బలి కాకూడదని ఆ తల్లి తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కరిని కదిలించింది. తప్పు ఎవరిదైనా నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అత్తమామల వేధింపులు తట్టుకోలేక క్షణికావేశంలో.. ముగ్గురు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య(SUICIDE) చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం జగన్నాథవలసలో చోటుచేసుకుంది. ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఆమెతో సహా ముగ్గురు చిన్నారులు బలి కావలసివచ్చింది.
అసలేమైంది..
మృతులు భోగేశ్వరి (27), చక్రి (5), జయలక్ష్మి (3), భరత్ (2)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే తల్లి ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. జగన్నాథవలస గ్రామానికి చెందిన భోగేశ్వరికి అదే గ్రామానికి చెందిన పొట్ట శంకర్‌తో తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. భార్య భర్తలు వ్యవసాయ పనులతో పాటు భర్త వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గడచిన రెండేళ్లుగా అత్త మామలు అసిరప్ప, ఆదినారాయణలు వేధింపులు రోజురోజుకు ఎక్కువవడంతో.. వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పాలకొండ డివిజన్ డీఎస్పీ శ్రావణి ఇతర సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతురాలి తల్లి దేవర పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: cabinet decisions: కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..