ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి పేరు రాకూడదనే ఉద్దేశపూర్వకంగా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. కొత్త పథకాలు ప్రారంభించే ముందు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో నంది విగ్రహం తొలగించిన ఘటనలో తెదేపా ప్రమేయం ఉందని చెప్పారు.
'ఇంటివద్దకే రేషన్' వాహనాలను సీఎం జగన్ గురువారం ప్రారంభిస్తున్నారన్న మంత్రి అప్పలరాజు... దీన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహాల ధ్వంసం కార్యక్రమానికి ప్రణాళిక వేశారని విమర్శించారు. సంతబొమ్మాలి ఘటనలో సుస్పష్టంగా కుట్రకోణం ఉందన్నారు. తెదేపా కనుసన్నల్లోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి పనులు ఎవరు చేసే వారిని ప్రజలు రాజకీయంగా సమాధి చేస్తారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 3 రోజుల కస్టడీకి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి... సీఐడీ కార్యాలయంలో విచారణ