Irregularities in the MLC voter list of graduates in AP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో.. ఒక్క విశాఖ జిల్లాలోనే.. డిగ్రీ విద్యార్హత లేని 2వేల 163 మంది అనర్హులను ఓటరుగా నమోదు చేశారని.. 8వేల 486 మంది పేర్లు జాబితాలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉన్నాయంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
కడప- అనంతపురం- కర్నూలు, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోనూ ఇదే పరిస్థితి. ఈ మూడు నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అధికార వైసీపీ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు.. గ్రామ, వార్డు వాలంటీర్లకు లక్ష్యాలు విధించి భారీ ఎత్తున ఓటర్లను చేర్పించింది. వాలంటీర్లు గంపగుత్తగా ఎన్ని దరఖాస్తులిచ్చినా పరిశీలించకుండానే ఆమోదించేశారని, అందువల్లే ముసాయిదా జాబితాలో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి . ఒకే వ్యక్తి పేరు ఒకటికి మించి పలుమార్లు నమోదు చేసినట్లు ఆక్షేపిస్తున్నాయి.
ఓటరు నమోదు సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి పనులూ వాలంటీర్లకు అప్పగించొద్దంటూ.. ఎన్నికల సంఘం నాలుగైదుసార్లు ఆదేశాలిచ్చినా.. ఆచరణ మాత్రం శూన్యం. వాలంటీర్లు.. అధికార పార్టీకి అనుకూలమైన వారినే చేర్పిస్తున్నారని, ప్రతిపక్షాల సానుభూతిపరులు, మద్దతుదారులు దరఖాస్తులను పరిగణనలోకి కూడా తీసుకోనివ్వడం లేదంటూ ఈసీకి ఫిర్యాదులందినా చర్యల్లేవు. వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలే స్వయంగా ప్రకటించినా ఎన్నికల సంఘం వారి నుంచి కనీసం సంజాయిషీ కూడా కోరలేదని విపక్షాలు పెదవి విరుస్తున్నాయి.
పట్టభద్రులు ఓటు ఆన్లైన్లోనూ నమోదు చేసుకోవాలంటే.. దరఖాస్తుతో పాటు విద్యార్హతకు సంబంధించి డిగ్రీ పట్టాను అప్లోడ్ చేయాలి. చాలా మంది డిగ్రీ పట్టాకు బదులుగా ఏదో ఒక పత్రాన్ని లేదంటే వేరేవారి డిగ్రీ పట్టాను అప్లోడ్ చేసేశారు. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ధ్రువపత్రాలన్నీ చూసి అర్హులైతేనే ఓటర్లుగా అవకాశం కల్పించాలి. ఆ ప్రక్రియ కూడా సజావుగా జరగలేదు. ఓటు కోసం చివరి రోజున భారీగా వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం అనర్హులేవనని ప్రచారం జరుగుతోంది.
ఇవీ చదవండి: