అల్పపీడన ప్రభావంతో నేడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంకాగా... పలు చోట్ల ఇళ్ల మధ్యకు నీరు చేరి.. స్థానికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా..
రెండు రోజులుగా గన్నవరం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బీబీగూడెం, ముస్తాబాద, గన్నవరం రాయ్ నగర్, పెద్దఅవుటపల్లి, తేలప్రోలు, బుద్ధవరంలోని పలు కాలనీల్లోకి భారీగా నీరు చేరడంతో.. నీటిని తొలగించే పనిలో స్థానికులు నిమగ్నమయ్యారు. సత్వరమే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరారు.
శ్రీకాకుళం జిల్లా..
ఆమదాలవలసతోపాటు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రహదారులు పంట పొలాలు జలమయమయ్యాయి. వర్షాలు కురవటంతో ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల వేసుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా
తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వరి నారుమళ్లు, ఇతర పంటలు నీట మునగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి