పొంగుతున్న వాగులు..వంకలు
శ్రీకాకుళం జిల్లాను కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, గెడ్డలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి, మొక్కజొన్న సహా ఇతర పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడం మండలాల్లో... కుండపోత వర్షం కురుస్తోంది. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో.. వంశధారకు ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. హిరమండలం గొట్టా బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. బహుదా నదిలో ఉద్ధృతి మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..
పులిచింతలకు జలకళ
కృష్ణా జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంచికచర్ల సమీపంలో ఉద్ధృతంగా మారిన తోళ్లవాగు, నక్కల వాగు ప్రభావంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. గుంటురు జిల్లాలో వర్షాలతో పంటలు నీటమునిగాయి. ప్రత్తిపాడు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం పత్తి, మిరప రైతులకు నష్టాలు మిగిల్చింది. పులిచింతల జలాశయం జలకళ సంతరించుకోవడంతో.. నీటిని దిగువకు మళ్లిస్తున్నారు.
శ్రీశైలానికి ప్రవాహం
ప్రకాశం జిల్లాలోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. చినగంజాం మండలం గొనసపూడి వద్ద.. నేలవంతెన నీటిలో మునిగింది. ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో... రాకపోకలు నిలిచాయి. అద్దంకి పరిధిలో వారం నుంచి కురుస్తున్న వర్షాలతో... పంటలు మునిగే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో కురిసిన వర్షాలకు... వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీశైలానికి క్రమంగా ప్రవాహం పెరుగుతుండడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం బి.రాయపురంలో... వాగులు ఉద్ధృతంగా మారాయి. వర్షాల ధాటికి కడప జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 216.39 కిలోమీటర్ల పొడవైన రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 65 ప్రాంతాల్లో రోడ్లు కోసుకుపోవడం సహా... 34 చోట్ల కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి.
తూర్పుగోదావరిలో...కుండపోత
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెరువులను తలపిస్తున్న రోడ్లపై రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పొలాలు నీటమునిగి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏలేశ్వరం, రౌతులపూడి, శంఖవరంలోనూ... వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రవాహం రహదారులపై చేరి... ప్రయాణికులు ఆపసోపాలు పడ్డారు. లంపకలోవ, వేములపాలెం, పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో... పరిస్థితి తీవ్రంగా ఉంది.
ఇదీ చదవండి: శ్రీకాకుళం.. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం