రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వైకాపా పథకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం తెదేపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు రూ.1400 కోట్లతో వైకాపా రంగులు వేశారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల సయమంలో పాఠశాలలకు తెల్ల సున్నం వేస్తే ఈ నిధులన్నీ వృథా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వాస్తవాలు రాస్తే పాత్రికేయులను జైల్లో పెడతామంటున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి నెలనెలా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ముడుపులు ఇవ్వలేదని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో బీర్ల పరిశ్రమను మూసేశారని అన్నారు. ప్రజల్లో ఆందోళన నెలకొన్నందున రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి వల్లకాడు అయితే... అక్కడ నుంచి పాలన సాగించేవారు రాక్షసులా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి