BAVANAPADU Residents fire on YCP government: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 19వ తేదీన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఓడరేవు శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికే వైఎస్సార్సీపీ మంత్రులు, అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.
ఈ క్రమంలో భావనపాడు పోర్టు శంకుస్థాపనకు ప్రభుత్వం సిద్ధం కావడంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకుండానే శుంకుస్థాపన ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పరిహారం, పునరావాసం, ఉద్యోగ కల్పనపై ఇచ్చిన హామీలను నెరవేర్చాకే ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. పోర్టు నిర్వాసితులకు గతంలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చండి- ఆ తర్వాతే భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు.
రేషన్ కార్డు ఉన్నవారికి రెండు ఉద్యోగాలను ఇస్తామంటూ గతంలో హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. గతంలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చి.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో నివాసిస్తున్న నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణానికి.. ఈ నెల19న సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అయితే.. తమ సమస్యలను పట్టించుకోకుండా శంకుస్థాపనకు సిద్ధం కావడంపై పోర్టు నిర్వాసిత గ్రామాలు మూలపేట, విష్ణుచక్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూలపేటకు చెందిన 528 కుటుంబాలు, విష్ణుచక్రంలో 59 కుటుంబాల నుంచి మొత్తం 332 ఎకరాల భూమి సేకరించారు. అందులో 225 ఎకరాల భూములకు సంబంధించిన రైతులకు.. ఎకరాకు 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. మిగిలిన వారికి ఎప్పుడిస్తారో ప్రకటించలేదు. దీనిపై బాధిత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఎప్పుడిస్తారో, ఎంత ఇస్తారో చెప్పకుండా పోర్టుకు శంకుస్థాపన చేస్తే.. ఆ తర్వాత తమను పట్టించుకునే నాథుడెవరి ప్రశ్నిస్తున్నారు.
అలాగే, రేషన్ కార్డుకు రెండు ఉద్యోగాల చొప్పున ఇస్తామంటూ హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే నోటిఫికేషన్ ఇచ్చేసి మోసం చేశారని మండిపడుతున్నారు. మరోవైపు అంతా సక్రమంగానే జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 95 శాతం మందికి పరిహారం చెల్లించామని.. మిగిలిన వారికి కూడా రెండు మూడు రోజుల్లో అందిస్తామని అధికారులు అంటున్నారు.
ఇవీ చదవండి