సీతానగరం గ్రామానికి చెందిన బత్సల జోగారావు, బత్సల వెంకట్రావు, బొడ్డు దానయ్య గతేడాది వెల్డింగ్ పనులకు లిబియా వెళ్లారు. వీరి వీసా గడువు ముగుస్తుండటంతో సెప్టెంబర్ 14 తేదీన భారత దేశానికి వచ్చేందుకు ట్రిపోలి విమానాశ్రయానికి బయలుదేరి ప్రయాణిస్తున్న సమయంలో.. అదృశ్యమయ్యారు. ఏపీకి చెందిన ముగ్గురు యువకులతో పాటు ఉత్తర్ప్రదేశ్, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు ఆగంతుకుల చేతుల్లో బందీలయ్యారు.
లిబియాలో భారత్ దౌత్యాధికారులు, వారికి ఉపాధి కల్పించిన సంబంధిత కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చర్చించారు. దీంతో సంబంధిత కంపెనీ యాజమాన్యం పలుమార్లు ఆగంతుకులతో మాట్లాడారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడారు. నెల రోజుల తరువాత.. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బందీలుగా ఉన్న యువకులను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించినట్టు భారత దౌత్య అధికారులు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
యువకులను లిబియాలో ఉపాధి కల్పించిన సంస్థకు అప్పగించారు. వారం రోజుల్లో స్వదేశానికి పంపిస్తున్నట్టు వారు తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించారు. ఉగ్ర చెర నుంచి బయట పడిన వార్త తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య