YSRCP MLA Rambabu Warning: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. గుంటూరు నుంచి ప్రకాశం వరకు.. ఎక్కడ చూసినా అధికార పక్షంలో అధిపత్యపోరు కనిపిస్తోంది. ఆయా జిల్లాలోని సమన్వయకర్తల ముందే వైసీపీ నేతలు బాహాబాహికి దిగడం రోజు చూస్తునే ఉన్నాం. తాజాగా గుంటూరులో తమకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ శ్రీదేవికి వ్యతిరేకంగా నిరసన తెలుపగా.. మరోచోట వైసీపీ ఎమ్మెల్యే తన పార్టీ నేతలే తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట టౌన్లో వాలంటీర్, కన్వీనర్ల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కొందరు పనిగట్టుకుని తనతో పాటుగా తన కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో ఉండి పని చేయించుకున్న వాళ్లే తన వెనకాల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబం మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ఆరోపణలు చేసే వారందరికీ ఒక్కటే హెచ్చరిక అంటూ... తనను కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా విమర్శిస్తే అలాటి వారికి తగిన గుణపాఠం చెప్తానని హెచ్చరించారు. కావాలంటే చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు.
తాను ఏ రోజూ అవినీతికి పాల్పడలేదనీ.. ఎవరికి అన్యాయం చేయలేదని తెలిపారు. తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ.. ఆవేశంతో ఊగిపోయారు. పార్టీకి గానీ కార్యకర్తలను గానీ అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే పెద్దలవద్ద కూర్చొని మాట్లాడుకోవాలని తెలిపారు. వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహించే సమస్య లేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: