ప్రకాశం జిల్లాలో 3,500 కి.మీ. మేర రహదారులు భవనాల శాఖ రహదారులుండగా కంకర తేలి, కోతకు గురై, గుంతలమయంగా మారాయి. రెండేళ్ల క్రితం వేసిన కొన్ని దెబ్బతిన్నా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణ చేయాల్సిన గుత్తేదారులు వాటి వైపు చూడటం లేదు. దీనికితోడు ఇటీవలి వర్షాలకు గిద్దలూరు, చీరాల, అద్దంకి, పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో 184 కి.మీ. మేర దెబ్బతినగా రూ.10 కోట్లకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే రహదారి వారీగా పరిస్థితి, వ్యయ అంచనా నివేదిక అందజేయాలని ప్రభుత్వం కోరడంతో వారు ఆ పనిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేని సర్కారు జిల్లాలో ఏడు మార్గాల్లో రూ.262 కోట్లతో రహదారులు నిర్మించడానికి టెండర్లు పిలవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు ఆలోచన...!
నిధుల సమస్య కారణంగా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపడం లేదని, త్వరలో ప్రైవేటు ద్వారా ఆయా పనులు చేయించి టోల్ వసూలు చేసుకునే అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తోందని తెలిసింది. అందుకే నూతన నిర్మాణాలు, మరమ్మతులు సకాలంలో చేయడం లేదన్న వాదనలు లేకపోలేదు.
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నాం. ఇటీవలి వర్షాలకు ధ్వంసమైన వాటి వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. అలాగే ఏడు రహదారుల నిర్మాణాలకు ఇటీవలే టెండర్లను ఆహ్వానించాం. అయితే ఇంకా సమయం ఉన్నందున ఇప్పటి వరకు బిడ్లు దాఖలు కాలేదు. - మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, ర.భ.శాఖ
ఇదీ చదవండి