Balakrishna Veera Simha Reddy : సినీ ప్రియులు, నందమూరి అభిమానులకు ‘వీర సింహారెడ్డి’ టీమ్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకు పిల్లలు, వృద్ధులను తీసుకురావొద్దని తెలిపింది. భద్రత దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొంది. వీరసింహారెడ్డి వేడుకలు సజావుగా జరగాలంటే.. పోలీసులకు సహకరించాలని కోరింది.
ఒంగోలులోని అర్జున్ ఇన్‌ఫ్రా గ్రౌండ్లో సాయంత్రం 6 గంటల నుంచి జరిగే వీరసింహారెడ్డి వేడుకలకు బాలకృష్ణతోపాటు శృతిహాసన్, దర్శక నిర్మాతలు, నటీనటులు హాజరుకానున్నారు. వేడుకలకు నిర్వాహకులు ఇప్పటికే 30 నుంచి 40 వేల పాసులు జారీ చేశారు. పాసులున్న వారు మాత్రమే వేడుకలకు హాజరు కావాలని పోలీసులు సూచిస్తుండగా.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒంగోలుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది.
ట్రాఫిక్ ఆంక్షలు: ప్రీ రిలీజ్ వేడుక కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డ్‌ల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
ట్రైలర్ రానుంది..!: మాస్ యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ట్రైలర్ విడుదల జరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కౌంట్‌డౌన్ మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈసినిమా కోసం బాలకృష్ణ, శ్రుతిహాసన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.
ఇవీ చదవండి: