తెలుగు వారి వారసత్వ సంపదకు సంక్షిప్త పుస్తక రూపం పెద్దబాలశిక్ష. దీన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాలపై ప్రాథమిక జ్ఞానం పొందొచ్చు. అందుకే పుస్తక ప్రియులు ఈ గ్రంథాన్ని తెలుగు వారి ఆస్తిగా భావిస్తారు. అలాంటి ఈ గ్రంథం ఎక్కువ మందిని ఆకట్టుకునేందుకు కావాల్సిన ముఖచిత్రంతో ముందుకొస్తోంది. ఎవరికైనా కానుక ఇవ్వాల్సి వస్తే ఈ పుస్తకమే గుర్తుకొచ్చేలా గ్రంథ రూపకర్త గాజుల సత్యనారాయణ దాని కవర్ పేజీలో మార్పులు చేస్తున్నారు. దీంతో నామకరణ మహోత్సవం, పుట్టినరోజు, పుష్పాలంకరణ, పెళ్లిళ్లు ఇలా వేడుక ఏదైనా సరే.. ఆ విశేషాలు, చిత్రాలతో పుస్తక అట్టపై ముద్రించి సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి సంస్మరణార్థం ఆయన గుర్తుకొచ్చేలా ముద్రించిన కవర్‌పేజీతో ఆ పుస్తకాలను ఊరంతా పంచారు. ఒడిశా బరంపురానికి చెందిన ఓ కుటుంబం పెద్దబాలశిక్ష అట్టపై పెళ్లిపత్రిక అచ్చేసి బంధువులకు ఇచ్చి ఆహ్వానించింది. ఇలాంటి చిరుకానుకతో జ్ఞాన సముపార్జనే కాకుండా దాన్ని చూసినప్పుడల్లా ఆ వేడుకను గుర్తుచేస్తుందని పాఠకులు భావిస్తున్నారు. మీరూ ఇలా గుర్తుగా పెద్దబాలశిక్షను మలుచుకోవాలంటే పుస్తక రూపకర్త సత్యనారాయణను సంప్రదిస్తే సరి. ‘20 లేదా అంతకంటే ఎక్కువ పుస్తకాలు ఆర్డర్ ఇస్తే అదనపు ధరంటూ లేకుండానే మీకు కావాల్సినట్లు ముఖచిత్రం ముద్రించి ఇస్తాం’ అని సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: Azadi ka amrit mahotsav: ఐక్య భారత్ ఆగిందిలా!