HIGH COURT : పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో(2017) తన ఎమ్మెల్సీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను నిరర్థకమైనదిగా ప్రకటించాలని కోరుతూ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలుపొందిన యండపల్లి శ్రీనివాసులురెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినంత మాత్రాన గతంలో దాఖలైన పిటిషన్ను నిరర్థకమైనదిగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసుల వివరాలు దాచి పెట్టారనే ఆరోపణ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుపుతున్నామని, సాక్ష్యాధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారని, ప్రధాన పిటిషన్‌పై వాదనలు విని తుది నిర్ణయం వెల్లడించాల్సిన వ్యవహారం ఇది అని పేర్కొంది. ప్రధాన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్డ్ జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు గురువారం నిర్ణయం వెల్లడించారు.
అసలేం జరిగిందంటే: ప్రొగ్రసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి గెలుపొందారు. క్రిమినల్ కేసుల వివరాలు గోప్యంగా ఉంచిన నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి 2017 ఏప్రిల్లో హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ను అంగీకరించడం చట్ట విరుద్ధమని.. తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని పట్టాభిరామిరెడ్డి కోరారు.
ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. అయితే తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ప్రకటన వెలువడిన నేపథ్యంలో తన ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ నిరర్థకమైనదిగా ప్రకటించాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. అయితే శ్రీనివాసులురెడ్డి వేసిన అభ్యర్థనపై పట్టాభి రామిరెడ్డి తరఫున న్యాయవాది ఈవీవీఎస్ రవికుమార్ అభ్యంతరం తెలిపారు.
ఈ నెల 29 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నారు. ఎన్నికల పిటిషన్ నిరర్థకం కాదన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఆరేళ్ల నిషేధం విధించొచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ కొట్టేయాలని కోరారు. దీనిపై విచారణ జరపొచ్చన్నారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. శ్రీనివాసులరెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేస్తూ... ప్రధాన వ్యాజ్యంపై తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: