ప్రకాశం జిల్లా కనిగిరి నియోజక వర్గంలో అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కరోనా వైరస్, నివర్ తుపాన్ నిండా ముంచాయి. పండించిన పంటలను సకాలంలో అమ్ముకుని అప్పుల ఊబినుంచి గట్టేక్కుదామనుకునే లోపే.. అకాల వర్షాల కారణంగా పంటలన్నీ పాడయ్యాయి. ఓ పక్క అప్పులు గుది బండలా మారుతుంటే.. మరోపక్క పంటకు ధర లేక రైతుల విలపిస్తున్నారు. ప్రధానంగా బత్తాయి, నిమ్మ, మిరప, వంగ, దానిమ్మ, జామ సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
సరైన రవాణాసౌకర్యం లేక పంట ఎగుమతులన్నీ ఆగిపోయాయి. ఎగుమతులు లేక తోటలలోనే పండించిన పంటను వదిలేస్తున్నారు. కొంత మంది గిట్టుబాటు ధరరాక రోడ్లకు ఇరువైపులా ..బండ్లు పెట్టి అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.