మున్నాభాయ్ అలియాస్ అబ్ధుల్ సమద్ …
ది హైవే కిల్లర్.
కరుడుగట్టిన హంతకుడు. కోడిని చంపినంత తేలిగ్గా మనుషుల పీకలు తెగ్గోస్తాడు . శవాల్ని గోనెసంచుల్లో కట్టి దగ్గర్లోని కాల్వల వద్ద పూడ్చేస్తాడు.
ఈ పని చేసినందుకు అసలు పశ్చాత్తాప పడడు. ఒక దారుణ హత్య..తరువాత వంతెవరిదని ఎదురు చూస్తూంటాడు. ఇలాంటి కిరాతక పనుల కోసం 16 మందితో అతనో ప్రత్యేక ముఠానే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా మీదుగా వేళ్లే లారీలు డ్రైవర్లు ఈ ముఠా టార్గెట్. పోలీసు దుస్తులు వేసుకుని ట్రక్‌లు ఆపడం డ్రైవర్లు, క్లీనర్లను కిడ్నాప్ చేయడం పీకలు తెగ్గోయడం వీరి నేర విధానం. హత్యాకాండ తర్వాత లారీలోడ్‌ను అమ్మేయడం, వచ్చిన సొమ్మును జల్సా చేయడం.. అది ఖర్చవగానే మరో నేరానికి బయల‌్దేరడం ఈ ముఠా స్టయిల్. చెన‌్నయ్ -కోల్‌కతా ప్రధాన రహదారి అడ్డాగా సాగిన మున్నాభాయ్ గ్యాంగ్ దారుణ హత్యాకాండ 2008లో వెలుగు చూస్తే 2021 మే 24 న కోర్టు తీర్పుతో ముగింపు దశకు చేరింది.
ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు 8వ అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో 7 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఏం జరిగిందంటే..
కోల్‌కతా-చెన్నై 16వ నెంబర్ జాతీయ రహదారిలో 2008వ సంవత్సరంలో కొన్ని లారీలు, వాటిలో ఉన్న సరకు అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో అప్పటి ట్రైనీ డీఎస్పీగా పనిచేసిన దామోదర్, సీఐ శంకరరెడ్డికి ఓ క్లూ లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటనలు వెలుగు చూశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్ సమ్మద్ అలియాస్ మున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకున్నాడు. అంతకు ముందు గుప్తనిధులు ఆచూకీ చెబుతానని కొంతమంది ధనవంతులను నమ్మించి, వారి వద్దనుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. దీనివల్ల ప్రయోజనం లేదని దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించాడు.
అధికారినంటూ చెకింగ్
జాతీయ రహదారిపై అధికారిలా కాపు కాసి, లోడులతో ఉన్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరటం అదును చూసి మెడలో నైలాన్ తాడుతోనే పీకలు కోసేవాడు అబ్దుల్. మృతదేహాలను గోతాల్లో కుక్కి, తోటల్లో, అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని, సరకును మాయం చేసేది అతడి గ్యాంగ్. మద్దిపాడులో ఓ పాడుపడ్డ గోడౌన్‌ను అద్దెకు తీసుకొని అక్కడ లారీని తుక్కుగా మార్చి, సరకును విక్రయించి సొమ్ము చేసుకునేవారు.
ఈ కేసుతోనే వెలుగులోకి..
2008లో 21.7 టన్నుల ఓ ట్రక్కు పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడుకు రావాల్సి ఉంది. వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలో అది మిస్ అయింది. తమిళనాడుకు చెందిన ట్రక్కు యజమాని వీరప్పన్ కుప్పుస్వామి 2008 అక్టోబర్‌లో ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లారీ డ్రైవర్, క్లీనరే సరకు కొట్టేసినట్లు కుప్పుస్వామి అనుమానించాడు. కానీ అబ్దుల్ గ్యాంగ్.. లారీ, డ్రైవర్ క్లీనర్‌ను చంపేశారు. గుంటూరు వ్యాపారికి ఇనుము అమ్మేశారు. 2008లో ఈ కేసు నమోదుతో హైవే కిల్లర్ గ్యాంగ్ ఘోరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చంపేశాక కర్ణాటకలోని ఓ మాజీ ఎమ్మెల్యే దగ్గర అబ్దుల్ ఆశ్రయం పొందేవాడని సమాచారం.
వారి ద్యర్యాప్తులో ఉలవపాడు వద్ద లారీ డ్రైవర్, క్లీనర్ హత్యకు గురయ్యారని, గుండ్లకమ్మ వాగులో పూడ్చిపెట్టారని తేలింది. లారీని తుక్కుగా మార్చివేసి మద్దిపాడు వద్ద ఓ గోదాములో భధ్రపరిచినట్లు వెల్లడైంది. ఒంగోలు చెందిన మున్నా అలియాస్ ఎండీ అబ్దుల్.. సమ్మద్ గ్యాంగ్ పని అని పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం చేయగా.. మున్నాతో పాటు మరో 15 మంది ఈ నేరాల్లో ఉన్నారని తేలింది. బెయిల్‌మీద విడుదలయ్యాక ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు కూడా అప్పట్లో అభియోగాలు వచ్చాయి.
మరోవైపు నాగాలాండ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల మృత దేహాలు కూడా లభ్యం అయినా.. వారు ఎవరు అన్నది ఇంతవరకూ తేలలేదు. లారీ కూడా దొరికినా, ఆ లారీ యజమాని ఇంతవరకూ క్లైమ్ చేయలేదు. పోలీసులు అనేక మార్లు నాగాలాండ్ వెళ్లి వివరాలు రాపట్టే ప్రయత్నం చేయగా ఇంతవరకూ ఈ కేసుముందుకు వెళ్లలేదు.
13 మందిని చంపేసినట్లు అభియోగాలు
ఈ రహదారిలో దాదాపు 13 మందిని హత్య చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. తమిళనాడు, ఏపీ, బిహార్‌కు చెందిన ఏడుగురు డ్రైవర్లు, క్లినర్లను అత్యంత కిరాతకంగా చంపినట్లు విచారణలో తేలింది. ట్రైనీ డీఎస్పీ దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. మున్నాను, అతని అనుచరులను అప్పట్లో అరెస్టు చేశారు. అనంతరం నిందితుడు మున్నాకు బెయిల్ రావడంతో బెంగుళూరుకు పారిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మున్నా, అతని గ్యాంగ్ మీదున్న కేసులపై ఒంగోలు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. అబ్దుల్ గ్యాంగ్‌పై నేరాలు రుజువు కావడంతో కోర్టు వారిని దోషులుగా నిర్ధరించింది.
మున్నా గ్యాంగ్ మీద మెుత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఇవాళ ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది కోర్టు. నేరాలు రుజువవ్వడంతో మున్నా సహా 19 మందికి శిక్ష ఖరారు చేసింది. 12 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: మిత్రుడి ప్రాణాలు తీసిన బైకర్ దుస్సాహసం