కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది.. రోజురోజుకు కేసులు పెరుగుతుండటం, మరణాలు కూడా అధికంగా నమోదవటం ఆందోళన కలిగిస్తోంది.. ప్రకాశం జిల్లా కారంచేడులో సోమవారం ఒక్కరోజే ఆరుగురు మృతిచెందారు. దీంతో గ్రామంలోని ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. మిగిలినవారిలో కొందరు అనారోగ్యంతో.. మరికొందరు కరోనా లక్షణాలతో ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
కారంచేడు గ్రామంలో ఇప్పటికే అధికారికంగా 70 వరకు కరోనా పాజిటివ్ కేసులున్నాయి. మరికొందరు అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు.. పర్చూరు మండలం చెరుకూరు పంచాయతీ ఉప్పరపాలెంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ సుమారు 70 నివాసాలు.. 350 మంది జనాభా ఉండగా.. కరోనా కేసులు మాత్రం 73 ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఇంట్లో బాధితులున్నారు. అందరూ కాయకష్టంమీద బతికే వారే. సోమవారం ఒక్క రోజే 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓకే ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులు ఉండగా.. నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీనిని బట్టి కరోనా తీవ్రత ఆ గ్రామంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి