ఒంగోలులో నిర్వహించిన ఇంటర్ జోనల్ పాఠశాల బ్యాండ్ పోటీలు ఆకట్టుకున్నాయి. కేంద్ర మానవవనరుల శాఖ, రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించారు. బాలుర, బాలికల విభాగంలో పోటీలు జరిగాయి. జాతీయ స్థాయి పరేడ్‌లో అర్హత సాధించేందకు దేశ వ్యాప్తంగా ఆరు జోన్‌లలో బ్యాండ్ బృందాల పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మొదలై జిల్లా, రాష్ట్రా స్థాయి వరకు జరుగుతాయి. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినవారు జోన్ స్థాయిలో పోటీ పడాల్సి ఉంటుంది. దక్షిణ జోన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్ష్యద్వీప్‌లు పోటీపడ్డాయి. జోనల్ స్థాయిలో ఒక బాలికల టీమ్‌ను, ఒక బాలుర టీమ్‌ను ఎంపిక చేస్తారు. ఇలా ఆరు జోనుల నుంచి వచ్చిన వారితో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు.
దక్షిణ జోన్ నుంచి తాడేపల్లిగూడెం బాలయోగి సాంఘిక సంక్షేమ పాఠశాల బృందం విజయం సాధించింది. దాదాపు రెండు నెలల కఠిన శిక్షణ తీసుకోవటంతోనే విజయం సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. వివిధ వేషధారణలతో సూజఫోన్, ట్రంబోన్, యూఫూనియం, క్లెర్ నెట్, ట్రంపెట్, సైడ్ డ్రమ్స్, బేస్ డ్రమ్స్ వంటి వాయిద్యాలను ఉపయోగించారు. స్కైబోర్డ్స్ , పిపియో, తదితర ట్యూన్స్‌ను వినసొంపుగా వాయించి గెలుపొందారు. పోటీల్లో నిబంధనలు చాలానే ఉంటాయి. ప్రతీ కదలికకు మార్కులు కేటాయిస్తారు. ఎంచుకునే డ్రస్ కోడ్ పైనా షరతులు ఉంటాయి. వీరు ధరించే దుస్తుల నుంచి ఎంచుకునే వాయిద్యాల వరుకూ మార్కులు కేటాయిస్తారు. ప్రదర్శనలో జాతీయ భావాలున్న గీతాన్ని ఆధారం చేసుకుని ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులో జాతీయ గీతాన్ని పాడడం నిషేధం. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు ధృవీకరణపత్రం అందజేస్తారు. ఇటువంటి పోటీలతో చిన్ననాటి నుంచే విద్యార్థులకు జాతీయ భావాలు పెంపొందుతాయని పలువురు కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి: దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు