ప్రకాశం జిల్లా రామాయపట్నం వద్ద నాన్ మేజర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. విభజన చట్టం ప్రకారం పోర్టు నిర్మాణంపై కేంద్రానికి డీపీఆర్ సమర్పించడంలో.. గతంలో జరిగిన జాప్యంతో నిర్మాణం ఆలస్యమైంది. దుగరాజపట్నం వద్ద నిర్మాణ వ్యయం ఎక్కువవడంతోపాటు, నిర్వహణ కూడా కష్టమన్న అంచనాతో ప్రభుత్వం రామాయపట్నాన్ని ఎంపిక చేసింది. కేంద్రం కూడా పచ్చజెండా ఊపడంతో... తాజాగా సమగ్ర నివేదిక రూప కల్పనకు సిద్ధమైంది. ప్రస్తుతం పోర్టు నిర్మాణానికి డీపీఆర్‌ను దిల్లీలోని రైట్స్ సంస్థ సిద్ధం చేస్తోంది.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు! నిర్మాణానికి 3500 ఎకరాలు కేటాయింపు..పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం 3 వేల 500 ఎకరాలు కేటాయించినట్లు తెలుస్తోంది. 8 బెర్తుల నిర్మాణంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన బ్రేక్ వాటర్, నేవిగేషన్ కెనాల్స్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందుకుగానూ సుమారు 5 వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యే అవకాశం ఉంది.
వాణిజ్య ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం..రామాయపట్నం పోర్టు ద్వారా... ఈ ప్రాంతం వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు సహా... తెలంగాణ, కర్టాటక, మహారాష్ట్ర నుంచి... ఎగుమతి, దిగుమతులు భారీగానే జరిగే అవకాశముంటుందని అంచనా వేస్తోంది. 13 మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ సామర్థ్యంతో పోర్టు నిర్మాణం చేపడితే విదేశీ వాణిజ్యానికి ఊతమిచ్చే ఆస్కారముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 2026 నాటికి... ఈ ప్రాంతం నుంచి 46 మిలియన్ టన్నుల వాణిజ్యం జరగొచ్చని అంచనా.
ఇదీ చదవండి : అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష... రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం