Mekapati Chandrasekhar Reddy Comments: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్థులు తమ సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. గ్రామాల్లో సిమెంటు రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు. ఇప్పటికే వేసిన సిమెంటు రోడ్లకు డబ్బులు ఇవ్వక, బిల్లులు ఇవ్వకపోవడంతో వేసినవాళ్లు ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు.
గతంలో పనులు చేసిన వాళ్లకు ఇప్పటివరకు డబ్బులు రాలేదని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పనులు చేయడం కష్టం.. ఎవరు చేస్తారు చెప్పండి అంటూ ప్రశ్నించారు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఎవరు చేయగలరని.. స్వయానా ఎమ్మెల్యే మాట్లాడటంతో ప్రజలు, నాయకులు అవాక్కయ్యారు. కలిగిరి మండలం నాగసముద్రం సచివాలయ పరిధిలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సిమెంట్ రోడ్లు వేయించాలని ప్రజలు ఎమ్మెల్యేను కోరగా ఆయన పైవిధంగా స్పందించారు.
ఈ మధ్యనే వైసీపీ పరిశీలకుడి విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేసి సంచలనం రేపిన ఎమ్మెల్యే మేకపాటి.. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రెండు రోజుల క్రితం వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి.. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన పరిశీలకుడు.. నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ధనుంజయ రెడ్డి నిర్ణయాల వలన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు. తాను వైయస్ కుటుంబానికి విధేయుడినని.. తన మీద పెత్తనం చేయడానికి కుదరదంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి దగ్గరైనా లేక జిల్లా మంత్రి దగ్గర తేల్చుకోడానికే కాదు.. దేనికైనా నేను సిద్ధమంటూ సవాలు విసిరారు.
ఇప్పటికే ఆనం, కోటంరెడ్డిలు వైసీపీ అధిష్ఠానంపై అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఆయా స్థానాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్లను మార్చారు. ఇలాంటి సందర్బంలో మేకపాటి తీరు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.
ఇవీ చదవండి: