నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో విషాదం చోటు చేసుకుంది. సరదదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వికలాంగుల కాలనీ, భగత్ సింగ్కాలనీలో నివాసం ఉంటూ ఎనిమిదో తరగతి చదవుతున్న అలీం(13), వెంకటసాయి(13), రాజేష్(13) స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో ముగ్గురు సరదాగా చెముడు గుంట చెరువులో ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు పిల్లలు చెరువులో గల్లంతయ్యారు. ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టూ పక్కల ప్రాంతాల్లో గాలించారు. పిల్లల సైకిళ్లు, దుస్తులు చెరువు గట్టుపై చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి వీలు కాకపోవడంతో ఈ రోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
పిల్లలను విగత జీవులుగా చూసిన తల్లిదండ్రులు.. శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అటు.. ఇటు చేరుతూ.. అలజడి రేపుతూ..