TDP CPI Leaders Meet in Nellore: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu Arrest) తరువాత నెల్లూరు జిల్లాలో.. తెలుగుదేశం పార్టీ.. ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు వేగంగా పావులు కదుపుతోంది. బుధవారం జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అదే విధంగా ఈ రోజు సీపీఐ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం బీజేపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కలిసి పోరాట కార్యచరణను రూపొందిస్తున్నారు. సమీకరణలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతున్నారు.
గాంధీకి చెబుదాం పేరుతో భారీ ర్యాలీ: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున భారీ ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు.. జనసేన, సీపీఐ, బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు ఇప్పటికే ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జులు ముందుకు కదిలారు. గాంధీ జయంతి రోజున భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ప్రజా పరిరక్షణ కోసం, సైకో పాలన నుంచి ప్రజలను విముక్తి కలిగించేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకకుండా వైసీపీ చేయాలను కుటుందని మండిపడ్డారు. చంద్రబాబు బయట ఉంటే తాము అధికారంలోకి రాలేము అన్న ఆలోచనలతో అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు.
వారిపై సైతం కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారు: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను అంతం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని.. చంద్రబాబు కుటుంబాన్ని అణిచివేయాలని అనుకుంటున్నారని విమర్శించారు. లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపై సైతం కేసు పెట్టేందుకు యత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను లేకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేసేందుకు ముందుకు కదులుతున్నామని తెలిపారు. వైసీపీ అక్రమ పాలనపై సీపీఐతో కలిసి పోరాడతామని ఆనం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు కంభం విజయరామిరెడ్డి, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, జెన్నీ రమణయ్య, రాజా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
"చంద్రబాబు బయట ఉంటే అధికారంలోకి రాలేము అనే దుర్బుద్ధి జగన్ మోహన్ రెడ్డికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని ప్రతి సర్వే చెబుతోంది. ఇక ప్రస్తుతం టీడీపీ, జనసేన కలిసిన తర్వాత మరి ఎదురులేదు అని సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజు జగన్ మోహర్ రెడ్డి దోపిడీని, అవినీతిని ప్రతి పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై గాంధీ జయంతి రోజుల ర్యాలీ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్ మోహన్ రెడ్డి బూట్ల కింద నిలిగిపోయింది". - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి