Sankranti Celebrations in Crematorium : నెల్లూరు ప్రజలకు సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. ఆ పర్వదినాన్ని పెద్దల పండుగగా శ్మశాన వాటికలో జరుపుకోవడం ఇక్కడి విశేషం. నగరంలోని పెన్నా నది ఒడ్డున బోడిగాడితోటలో సమాధుల పండుగను ఒకే చోట వేలాది మంది కలిసి నిర్వహిస్తారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ పెద్దల పండుగను ఇలా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పెద్దల పండుగను ఘనంగా జరుపుకున్నారు. సమాధుల వద్దకు వచ్చి తమ నుంచి దూరమైన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటామని నగరవాసులు చెబుతున్నారు.
పెద్దల పండుగకు ఆదరణ పెరుగుతోంది : సంక్రాంతి అంటే మాకు పెద్దల పండగ. చనిపోయిన పెద్ద వారిని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను శ్మశానంలో జరుపుకుంటాం. మేము చాలా ఏళ్ల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము. మా నాన్న మృతి చెందడంతో ఆయన ఆశ్వీరాదాలు తీసుకోవడం కోసం మా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో వచ్చాం. ఈ వేడుకను మా శక్తి మేరకు సంప్రదాయబద్దంగా ఆనందంగా జరుపుకుంటాం. ఈ పండుగకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. - నెల్లూరు ప్రజలు
ఘనంగా సంక్రాంతి సంబరాలు - పండగ శోభకు వన్నె తెచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆత్మలు ఆశీర్వాదం : పెద్దల పండుగ సందర్భంగా సమాధులను శుభ్రం చేసి పూలతో అందంగా అలంకరిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంధువులు, కుమార్తెలు, అల్లుళ్లు కూడా సమాధుల పండుగకు బోడిగాడితోటకు వస్తారు. ఇంటి నుంచి తీసుకువచ్చిన పిండి వంటలను చనిపోయిన వారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా తింటారు. వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. రాత్రి వరకు సమాధుల వద్దనే గడుపుతారు. పెద్దలకు పూజలు చేసి కొబ్బరికాయలు కొడతారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మలు వచ్చి తమను ఆశీర్వదిస్తారని వీరి నమ్మకం.
విశేషంగా ఆకర్షిస్తున్న బొమ్మల కొలువు - సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు
మధుర క్షణాలను గుర్తు చేసుకుంటాం : సంక్రాంతి రోజున పెద్దల పండగ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశం శ్మశానంలా అనిపించదు. ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారనే భావన కలుగుతుంది. మా కుటుంబ సభ్యులు రోజంతా ఇక్కడే ఉండి ఆనందంగా గడుపుతాము. పిండి వంటలను మృతి చెందిన మా పెద్దలకు నైవేద్యంగా పెట్టి తర్వాత మేము ప్రసాదంగా తింటాం. మా తాత, అమ్మమ్మలలో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటాం. వారి ఆత్మలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా నమ్మకం. - నెల్లూరు నగరవాసులు