Police Arrested Main Accused Sudhir in RTC Driver Attack Case: వాకీటాకీలు, విలాసవంతమైన గదులు, చుట్టూ జనం కోట్లలో లావాదేవీలు, మారణాయుధాలు, తుపాకీలు, అధునాతన పరికరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన కేటుగాడు సుధీర్ వ్యవహారమిది. వీటన్నింటి కోసం అతను ప్రత్యేకంగా ఓ డెన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. కావలిలో గత నెల 26న ఆర్టీసీ డ్రైవర్‌పై దురుణంగా దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న సుధీర్‌ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సుధీర్ నేరచరిత్రను గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వరరెడ్డి వెల్లడించారు. డ్రైవర్ రాంసింగ్‌పై దాడి విషయంలో ఏడుగురిని అప్పడే అరెస్టు చేశారు.
Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!
సుధీర్‌తో పాటు పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు కావలిలోని తుపాన్‌నగర్‌లో ఉన్న అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించగా అక్కడ ఉన్న పరికరాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.. అక్కడ నాలుగు వాకీటాకీలు, రెండు కత్తులు, నాలుగు పిస్తోళ్లు, బుల్లెట్లు, రెండు ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు, లీడింగ్ చైన్, బేడీలు, రూ 7 లక్షల నగదు, రెండు జామర్లు, అయిదు ల్యాప్‌టాప్‌లతో పాటు పదుల సంఖ్యలో సెల్‌ఫోన్లు, మూడు ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంటిని, హంగామాను చూసి పోలీసులే విస్తుపోయారు.
సీజన్‌ను బట్టి మోసాలు.. సుధీర్ గ్యాంగ్ సీజన్‌ను బట్టి మోసాలకు పాల్పడుతుంది. పెద్దనోట్ల రద్దు సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో తన మనుషులను ఏర్పాటు చేసుకుని కోటికి 75 లక్షల రూపాయలు ఇస్తామని ప్రచారం చేసుకున్నాడు. ఆ మాటలు నమ్మి ఎవరైనా నగదు పట్టుకుని వస్తే ముందు మంచిగా నగదు ముట్టజెప్పేవాడు. అలా నమ్మకం కుదిరాక మరోసారి భారీ మొత్తంలో నగదు పట్టుకువస్తే వారిని మోసగించేవాడు. అలాగే తక్కువ ధరకు బంగారం ఇస్తామని మోసం చేస్తుండేవాడు. కేజీ బంగారం 50 లక్షల వరకు ఉండగా, 35 లక్షలకు ఇస్తామని నమ్మిస్తుంటాడు. మొదటిసారి చెప్పిన విధంగానే ఇస్తాడు. తరువాత కోట్లలో నగదు వసూలు చేసి మోసం చేసేవాడు. 2 వేల రూపాయల నోటు రద్దు అవకాశాన్ని కూడా ఇలాగే సొమ్ము చేసుకున్నాడు.
నకిలీ పోలీసులులా వచ్చి దాడి.. లగ్జరీగా ఉన్న అతని ఇల్లు, హంగామా చూసి అందరూ మోసపోయేవారు. అతనితో డీలింగ్ మాట్లాడ్డానికి వచ్చేవారిని ఆ గదిలో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతలో అతడి మనుషులే పోలీసుల వేషంలో వచ్చి దాడి చేసేవారు. సుధీర్‌ను అరెస్టు చేసినట్లు నటించి నగదు సీజ్ చేసి తీసుకెళ్లిపోయేవారు. దాంతో బాధితులు భయపడి పారిపోయేవారు. తర్వాత ఎవరైనా వచ్చి అడిగితే చంపేస్తామని బెదిరించేవాడు. తమ జాడ తెలియకుండా ఉండేందుకు జామర్లు ఉపయోగించి ఎంతో తెలివిగా మోసాలకు పాల్పడుతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడులోనూ అతడి వల్ల మోసపోయిన వ్యక్తులు ఉన్నారని ఎస్పీ తెలిపారు.