నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రజలు.. పచ్చదనం పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ ఊరిని కాలుష్యం బారిన పడకుండా చూసుకునేందుకు... ఊరు పచ్చగా ఉండాలని కాంక్షిస్తూ.. చక్కటి కార్యక్రమాన్ని అమలు చేశారు. గత పాలకులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. వర్షాలు పడాలంటే పచ్చని చెట్లు ఉండాలని పురపాలక సంఘంలో ఉన్నతాధికారులు 15 వేల మెుక్కలు వెయ్యాలని నిర్ణయించారు. ఈ లెక్క కంటే ఎక్కువగానే 20 వేల మెుక్కలు నాటారు. వాటిని క్రమ పద్ధతిలో సంరక్షించారు. ప్రధాన రోడ్ల పొడువునా ఎక్కడ పురపాలక సంఘం ఖాళీ ప్రాంతం కనిపించినా అక్కడ మెుక్కలు ఒక ఉద్యమంలా నాటడం ప్రారంభించారు. ఏడాది నుంచి పడిన శ్రమకు నేడు ఏపుగా పెరిగిన చెట్లు.. పచ్చదనాన్ని పంచుతున్నాయి. అధికారులతో పాటు గ్రామస్తులకూ సంతోషం పంచుతున్నాయి. ఇప్పుడు నాయుడుపేటను చూస్తుంటే ఒక చిన్న సైజు అడవిలా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి : ఆశలు పదిలం... వర్షాలతో పంటలకు జీవం