నెల్లూరు జిల్లాలోని 11 మండలాల్లో పెన్నాతీర గ్రామాల్లో భూ దందా సాగుతోంది. పెన్నాతీర గ్రామాల్లోని పెత్తందారులు, ఆక్రమణదారులకు నదీతీర పొరంబోకు భూములు ఆదాయ వనరులా మారాయి. నదీతీర పరిరక్షణ, స్థానికుల అవసరాల కోసం నిర్దేశించిన భూములను స్థానిక పెత్తందారులు, వారి అనుచరులు కనిపించిన మేరకు ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమవిగా చూపి వేరుశనగ సాగు చేసే వలస రైతులకు అప్పగించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
ఆక్రమణలతో అవస్థలు
పశువులు, జీవాలు స్వేచ్ఛగా తిరుగుతూ మేత మేసి నీరు తాగే ప్రదేశాలను ఆక్రమించి సాగు చేయటంతో గ్రామాల్లోని పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణదారులకు పెత్తందారులు అండ ఉండటంతో అడ్డుకొనేవారే లేకుండా పోయారు. ఈ కారణంగా పశువులు, జీవాల పోషణ భారంగా మారింది.
నదిలో అక్రమ సాగుకు తీరం వెంబడి ప్రభుత్వ భూముల్లో బోర్లు ఏర్పాటుచేసి భారీగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. సోమశిల జలాశయం నుంచి నెల్లూరు నగరానికి తాగునీటి అవసరాలకు, ఆయకట్టు పైర్ల కోసం విడుదల చేసిన నీరు సైతం బోర్లకు మళ్లుతోంది.
అక్రమ సాగుకు విద్యుత్తు శాఖ ఊతం
సాధారణంగా రైతులకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ వారి పట్టా పొలంలోని బోరు, బావికి మంజూరు చేయాల్సి ఉంది. రైతుకు ఫలానా సర్వే నంబరులో భూమి ఉందని గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రంతో విద్యుత్తు శాఖ రైతు నుంచి ఒప్పంద పత్రం తీసుకొని పంపు సెట్లకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షను ఏర్పాటు చేస్తోంది.
పెన్నాతీర గ్రామాల్లో విద్యుత్తు శాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పెత్తందారుల పలుకుబడితో నదికి సమీపంలోని రైతుల సర్వే నంబర్లు చూపి ప్రభుత్వ భూముల్లో ట్రాన్సుఫార్మర్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ వ్యవహారం ఆక్రమణలకు అనుకూలంగా మారింది. పెన్నాతీర గ్రామాల్లో 20 శాతం కనెక్షన్లు ఇలాంటివే ఉన్నాయి.
రెవెన్యూ అధికారులు చెబుతోంది..
వీఆర్వోలను సంప్రదించి భూములు నిర్ధరించుకుని విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటే చేస్తే అక్రమసాగుకు అడ్డుకట్ట పడుతుందని, ఇందుకు భిన్నంగా ప్రభుత్వ భూముల్లో విద్యుత్తు సౌకర్యం ఇస్తున్న కారణంగా ఆక్రమణలు పెరిగిపోతున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం నుంచి వేగూరు వరకు పెన్నా తీరంలో 240 ఎకరాల విస్తీర్ణంలో కొందరు అక్రమార్కులు ఆక్రమించి పలు రకాల పంటలు సాగు చేశారు. 120 వరకు అక్రమంగా విద్యుత్తు కనెక్షన్లు పొందారు. నాలుగు దశాబ్దాలుగా ఈ తంతు సాగుతోంది.
అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇలా దురాక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శలున్నాయి. గ్రామాల్లో దాదాపు 800 ఎకరాల పొరంబోకు ఉంది. వీటిలో 400 ఎకరాల వరకు గ్రామస్థులు, మిగతాది స్థానిక పెత్తందారులు ఆక్రమించి వేరుశనగ, సవక, అదును బట్టి పుచ్చ, దోస పంటలను సాగు చేస్తున్నారు.
వివాదాల వెల్లువ
పెన్నా పొరంబోకు భూముల ఆక్రమణతో తీర గ్రామాల్లో ఆక్రమణదారులు, స్థానికులకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆక్రమణలపై రెవెన్యూశాఖ జారీ చేసిన నోటీసులు, ఏర్పాటు చేసిన బోర్డులతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. జలవనరుల శాఖ అక్రమ మోటార్లకు విద్యుత్తు కనెక్షన్ తొలగించమంటే ఆశాఖ ఊళ్లన్నింటికీ సరఫరా నిలిపి వేస్తోంది. నదీతీరంలో హద్దుల నిర్ధరణ సరిగా లేవంటూ ఆక్రమణలను అడ్డుకోబోయిన రెవెన్యూ సిబ్బందిపైనా ఆక్రమణదారులు పోలీస్‌స్టేషనులో ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇదీ చూడండి నాయుడుపేటలో పాస్టర్కు కరోనా పాజిటివ్