MLA Kotamreddy Sridhar Reddy latest comment: "ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి, నాకు పదిహేనేళ్లుగా అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్, వైసీపీతో సంబంధం ఉంది. ప్రస్తుతం రాజకీయాలు వదిలి కాంట్రాక్ట్ ఫీల్డ్‌లో సెటిలయ్యా. కోటంరెడ్డి నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్టరు విషయంలో అసహనం వ్యక్తం చేశాడు. నాది ఐఫోన్ కాదు.. ఆటోమేటిక్‌గా కాల్ రికార్డు అవుతుంది. ఆ రికార్డును యాదృచ్ఛికంగా ఆ కాంట్రాక్టరుకు వినిపించా. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదు." అని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు లంకా రామశివారెడ్టి తాజాగా వ్యాఖ్యలు చేశారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్టు: రామశివారెడ్టి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టునే తన స్నేహితుడు లంకా రామశివారెడ్డి చదివారని ఆరోపించారు. మేయర్‌తో పాటు 11మంది కార్పొరేటర్లు తన వెంట ఉన్నారని.. నేడు ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారిని పరిచయం చేశారు. అత్యంత కష్టాల్లో ఉన్నప్పుడు తన వెంట నడిచేందుకు విచ్చేసిన మేయర్‌కు, 11మంది కార్పొరేటర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
ధన్యవాదాలు సజ్జల రామకృష్ణా రెడ్డి: టెలిఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తే.. కేంద్ర హోంశాఖకు లేఖ రాయడానికి రాష్ట్ర పెద్దలకు ఎందుకంత భయమని కోటంరెడ్డి అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు రిజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టే తన స్నేహితుడు రామశివారెడ్డితో 'కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదు- అది రికార్డింగ్' అని చెప్పించారన్నారు. ఇప్పటికే కలత చెందిన సజ్జల స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వలేదని, రామశివారెడ్డితో ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగిందనే విషయాన్ని చెప్పించినందుకు ధన్యవాదాలు అని కోటంరెడ్డి అన్నారు.
ఆదాల..ఎప్పుట్నుంచి ఈ అవతారం?: వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫునే పోటీ చేస్తానంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేయాలని కోటంరెడ్డి కోరారు. కోటంరెడ్డి ఇక ధర్నాలు చేసుకోవడమే అని ఆదాల చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. నిజమే పోరాటాలతోనే తాను రాజకీయంగా ఎదిగాను కానీ.. ఆల్మట్టి కాంట్రాక్టు పనుల దగ్గర నుంచి రాలేదని ఆదాలను విమర్శించారు. ఆదాల తనకు కాంట్రాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా తెలుసునని.. జాతకాలు చెప్పే అవతారం ఆదాల ఎప్పుట్నుంచి ఎత్తారో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. 'టీడీపీ దగ్గర నుంచి బి-ఫారం తీసుకొని వైసీపీకి వచ్చిన నువ్వా.. నా గురించి మాట్లాడేది. కనుపర్తిపాడులో జరిగిన సభలో జగన్‌ను తిట్టి.. మేసేజ్ రాగానే చంద్రబాబు పిలుస్తున్నాడని చెప్పి.. జగన్ దగ్గరకు పరిగెత్తింది మర్చిపోయావా' అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహించారు.
ఇవీ చదవండి