YCP MLA Kotamreddy Sridhar Reddy comments: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి (మార్చి 14) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నెల్లూరు గ్రామీణ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తేల్చుకుంటానని వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ ఎన్నిసార్లు అడుగుతున్నా.. నేటీకి స్పందించటం లేదని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో గళం విప్పుతా: తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''రేపట్నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమౌతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. నేను దూరంగా జరిగిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశాలు ఇవి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్ని కూడా ఈరోజు నేను కొత్తగా మాట్లాడే సమస్యలెమీ కాదు. గత నాలుగేళ్లుగా.. జిల్లా పరిషత్ సమావేశాల దగ్గర్నుంచి అసెంబ్లీ సమావేశాలదాకా మాట్లాడుతూనే ఉన్నాను. ఒక శాసన సభ్యుడిగా నా నియోజకవర్గ సమస్యలపై పట్లు బాధ్యతగా ఉన్నాను. కానీ, చాలా సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయి. అందులో ముఖ్యంగా నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. రోడ్లతో పాటు గుంతల సమస్య, కాలువ సమస్యలతోపాటు పొట్టెపాలెం-మునిగుడి మధ్య వంతెనల నిర్మాణం వంటి తదితర అంశాలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చెందుకు ఎన్ని రకాల అవకాశాలు ఉన్న వాటిని ఉపయోగించుకొని.. నెల్లూరు సమస్యలపై రేపటి నుంచి శాసనసభ సమావేశాల్లో పోరాటం చేస్తాను'' అని ఆయన అన్నారు.
వాళ్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగాయి: నియోజకవర్గ సమస్యలపై గత నాలుగేళ్లుగా.. మంత్రుల చుట్టూ, కలెక్టర్ల ఆఫీసులు చుట్టూ, సీఎం జగన్ చుట్టూ తిరిగి తిరిగి తన చెప్పులు అరిగిపోయాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వ స్పందించాలని చాలాసార్లు వేడుకున్నానని అన్నారు. అయినా కూడా ప్రభుత్వం లేదని, అందుకే తాను రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలపై గళం విప్పనున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.
అందుకే వైసీపీ నుంచి బయటికి వచ్చాను: నెల్లూరు గ్రామీణ అభివృద్ధి పనులు జరగకపోవడం కారణంగానే తాను నమ్మిన వైసీపీ నుంచి బయటకు వచ్చానని కోటంరెడ్డి స్పషం చేశారు. ఆరోజు నుంచి ఈనాటిదాకా నిరంతరం నియోజకవర్గ సమస్యలపై ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో గత నాలుగేళ్లుగా సమస్యలు పరిష్కారం కాలేదని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలెమీ నెరవేరడం లేదని కోటంరెడ్డి గుర్తు చేశారు.
పార్టీ కార్యాలయంలో ప్లెక్సీలు తొలగించారు: నియోజకవర్గ సమస్యలపై జిల్లా స్థాయి నుంచి అసెంబ్లీస్థాయిదాకా అనేక సమవేశాల్లో బహిరంగంగా మాట్లాడుతున్నానని, వైసీపీపై అనేక ప్రశ్నల వర్షం సంధిస్తున్నానని..అధికార పార్టీకి చెందిన కొంతమంది తన కార్యాలయంలో ప్లెక్సీలను తొలగించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించకపోవడంతోనే తాను అసెంబ్లీ వేదికగా సమస్యలను లేవనెత్తుతానని ప్రకటించారు.
నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను కోటంరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. అందులో ముఖ్యమైన సమస్యలుగా.. 'రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. కాలువలు, పొట్టేపాళెం, ములుముడి కలుజులమీద వంతెనలు, బారాషాహీద్ దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం, యన్.టి.ఆర్. నెక్లెస్ రోడ్డులో గణేష్ ఘాట్ అభివృద్ధి పనులు, క్రిస్టియన్ కమ్యూనిటి హాల్ నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న షాదీమంజిల్ పనుల పూర్తి, ఆమంచర్ల వద్ద పారిశ్రామికవాడ, అంబేద్కర్ భవన్ , స్టడీసర్కిల్, బి.సి. భవన్, కాపు భవన్ పనుల పూర్తి, కొమ్మరపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, దొంతాలి గ్రామాలలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, వేలాది వ్యవసాయ భూముల సాగునీరుకు సంబంధించి ఆమంచర్ల డీప్ కట్ నిర్మాణం, ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డలకు ఎంతోమేలు చేసే గురుకుల పాఠశాల పనుల పూర్తి' వంటి తదితర అంశాలను ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ 6వ తేదీన జలదీక్ష: ఈ నెల 30వ తేదిలోపల పొట్టేపాళెం, ములుముడి కలుజు మీద వంతెనలకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే గనుక ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 9 గంటల పాటు జలదీక్ష చేసేందుకు తాను సిద్దమయ్యానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. నెల్లూరు గ్రామీణ సమస్యలను వెంటనే పరిష్కారించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి